Economy: భారత జీడీపీ అంచనాను 6.7 శాతానికి పెంచిన ఈవై

by S Gopi |

ముఖ్యంగా దేశ ఎగుమతులను ప్రభావితం చేసే గ్లోబల్ సవాళ్లను ఈ పరిణామాలు పరిమితం చేశాయని నివేదిక అభిప్రాయపడింది

Economy: భారత జీడీపీ అంచనాను 6.7 శాతానికి పెంచిన ఈవై
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జాతీయోత్పత్తి(జీడీపీ) అంచనాలను పెంచుతున్నట్టు ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఈవై తాజా నివేదికలో తెలిపింది. సోమవారం విడుదల చేసిన 'ఎకానమీ వాచ్ ' నివేదిక ప్రకారం, జూన్ త్రైమాసికంలో వృద్ధి మెరుగ్గా ఉండటం, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణల నేపథ్యంలో గతంలో అంచనా వేసిన 6.5 శాతం నుంచి దేశ జీడీపీ 6.7 శాతం పెరుగుతుందని భావిస్తున్నట్టు వెల్లడించింది. తొలి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ వృద్ధి 7.8 శాతమని ప్రభుత్వం ప్రకటించడం, జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలో డిమాండ్ పుంజుకుందని, ముఖ్యంగా దేశ ఎగుమతులను ప్రభావితం చేసే గ్లోబల్ సవాళ్లను ఈ పరిణామాలు పరిమితం చేశాయని నివేదిక అభిప్రాయపడింది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే దేశ జీడీపీ 2025-26లో 6.7 శాతం వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నట్టు నివేదిక పేర్కొంది.

కొత్త మార్కెట్ల అవసరం

కొనసాగుతున్న అమెరికా టారిఫ్ సంబంధిత అనిశ్చితులు, సరఫరా అంతరాయం వల్ల భారత్‌కు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలతో వాణిజ్య అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా యూఎస్, చైనాతో ఉన్న అంతర్జాతీయ వాణిజ్యం విధానాలను పునఃపరిశీలించడానికి వీలును కల్పిస్తాయి.

ఎగుమతుల విషయంలో భారత్ అమెరికాపై, కొంతవరకు చైనాపై ఆధారపడి ఉంది. బ్రిక్స్ దేశాలలో మరిన్ని అవకాశాలను అన్వేషిస్తూ, అమెరికా, చైనా రెండింటిపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా భారత్ తన ఎగుమతులను, దిగుమతి వనరులను ఇతర మార్కెట్లకు మళ్లించాల్సిన సమయం వచ్చిందని ఈవై ఇండియా ప్రధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ అన్నారు.

Next Story