Exports: పదేళ్ల గరిష్ట స్థాయికి చేరిన భారత ఎగుమతులు

by S Gopi |

ఇది గడిచిన 10 ఏళ్లలోనే అత్యధికం కావడం విశేషం.

Exports: పదేళ్ల గరిష్ట స్థాయికి చేరిన భారత ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వాణిజ్య లోటు గణనీయంగా దిగొచ్చింది. సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ ఏడాది నవంబర్‌లో దేశ వాణిజ్య లోటు 24.53 బిలియన్ డాలర్లు(రూ. 2.22 లక్షల కోట్లు)గా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో ఇది 31.93 బిలియన్ డాలర్లు(రూ. 2.89 లక్షల కోట్లు)గా ఉంది. మరోవైపు, నవంబర్ నెలలో దేశ దిగుమతులు 1.88 శాతం తగ్గి 62.66 బిలియన్ డాలర్లు(రూ. 5.68 లక్షల కోట్ల)కు చేరాయి. ఎగుమతులు మాత్రమే ఏకంగా 23.15 శాతం పుంజుకుని 38.13 బిలియన్ డాలర్ల(రూ. 3.46 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. ఇది గడిచిన 10 ఏళ్లలోనే అత్యధికం కావడం విశేషం. ఎగుమతులు ఈ స్థాయిలో వృద్ధి సాధించేందుకు ఇంజనీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, రత్నాభరణాలు, డ్రగ్స్, ఫార్మా వంటి రంగాలు ప్రధాన చోదకాలుగా ఉన్నాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. సమీక్షించిన నెలలో బంగారం దిగుమతులు 60 శాతం తగ్గాయి. బంగారం కాకుండా, పెట్రోలియం ఉత్పత్తులు, వంట నూనె, బొగ్గు దిగుమతులలో కూడా గణనీయమైన క్షీణత కనిపించిందని ప్రభుత్వ డేటా స్పష్టం చేస్తోంది.

ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 2.62 శాతం పెరిగి 292.07 బిలియన్ డాలర్ల(రూ. 26.50 లక్షల కోట్ల)కు చేరుకోగా, ఈ ఎనిమిది నెలల కాలంలో దిగుమతులు 5.59 శాతం పెరిగి 515.21 బిలియన్ డాలర్ల(రూ. 46.75 లక్షల కోట్ల)కు చేరాయి.

'టారిఫ్‌లు ఉన్నప్పటికీ అమెరికాకు ఎగుమతులు చేయగలుగుతున్నాం'

డేటా ప్రకారం, నవంబర్‌లో అమెరికాకు గతేడాది కంటే 22 శాతం ఎక్కువగా 6.97 బిలియన్ డాలర్ల(రూ. 63.24 వేల కోట్ల) విలువైన ఎగుమతులు జరిగాయి. టారిఫ్‌లు విధించినప్పటికీ, మేము అమెరికాకు ఎగుమతులను కొనసాగించగలిగామని రాజేష్ అగర్వాల్ అన్నారు. అయితే, ఇరు దేశాలు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ ప్రస్తుతం అమెరికాతో చర్చలు కొనసాగిస్తోంది.

Next Story