- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nitin Gadkari: ఆరు నెలల్లో పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఈవీ ధరలు: నితిన్ గడ్కరీ
ఈ పరిణామాలే దేశ పురోగతికి క్లీన్ ఎనర్జీ కీలకంగా మారేందుకు దోహదపడుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ధరలు మరో 4-6 నెలల్లో పెట్రోల్ వాహనాల ధరలతో సమాన స్థాయికి చేరుకుంటాయని కేంద్ర రోడ్డు, రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సోమవారం జరిగిన ఫిక్కీ ఉన్నత విద్యా సదస్సు-2025 కార్యక్రమంలో ప్రసంగించిన గడ్కరీ.. భారత సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం ఆర్థిక భారం అవుతుంది. ఇంధన దిగుమతుల కోసం మనదేశం ఏటా రూ. 22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. పైగా ఈ ఇంధన వాడకం పర్యావరణానికి ముప్పు కలిగిస్తుందని మంత్రి తెలిపారు. ఈ పరిణామాలే దేశ పురోగతికి క్లీన్ ఎనర్జీ కీలకంగా మారేందుకు దోహదపడుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో దేశ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. మరో 4-6 నెలల్లో ఈవీల ధరలు పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఉంటాయి. తాను రవాణా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు, దేశ ఆటో మొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడు అది రూ. 22 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ. 78 లక్షల కోట్లు, చైనా రూ. 47 లక్షల కోట్లు, భారత్ రూ. 22 లక్షల కోట్లతో కొనసాగుతున్నాయి. మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనంగా రూ. 45,000 కోట్లు సంపాదించారని గడ్కరీ ప్రస్తావించారు.
2027 నాటికి దేశంలోని మొత్తం ఘన వ్యర్థాలను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించాలని, తద్వారా వ్యర్థాల నుంచి విలువను సృష్టించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్టు మంత్రి వివరించారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో అభివృద్ధి సాధించేందుకు సరైన జ్ఞానంతో స్పష్టమైన, తెలివైన ప్రణాళిక ఇప్పుడు మనకు అవసరం, ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో యువత, ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి ఉందని మంత్రి అన్నారు. ఇదే భారత్‌కు ఉన్న అతిపెద్ద బలం, ఈ బలాన్ని ఉపయోగించడం ద్వారా వారికి సరైన విద్య, నైపుణ్యాలను అందించడంలో మనం విజయవంతమైతే, ప్రపంచంలో ముందుకు సాగవచ్చని ఆయన పేర్కొన్నారు.






