EU: యాపిల్, మెటా కంపెనీలకు భారీ జరిమానా విధించిన యూరోపియన్ యూనియన్

by S Gopi |

డిజిటల్ మార్కెట్ల చట్టానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా యాపిల్‌, మెటాకు భారీ పెనాల్టీ విధించింది

EU: యాపిల్, మెటా కంపెనీలకు భారీ జరిమానా విధించిన యూరోపియన్ యూనియన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీల్లో ప్రధానమైన యాపిల్, మెటాలకు యూరోపియన్ యూనియన్ వందల మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. రాయిటర్స్ ప్రకారం, యూరోపియన్ యూనియన్(ఈయూ) రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన డిజిటల్ మార్కెట్ల చట్టం(డీఎంఏ)కి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా యాపిల్‌కు 570 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 4,866 కోట్లు), మెటాకు 228 మిలియన్ డాలర్ల(రూ. 1,946 కోట్ల) భారీ పెనాల్టీ విధించింది. టెక్ కంపెనీలు ఈయూ కూటమి నిబంధనలను పాటించేందుకు, దిగ్గజ సంస్థ ఆధిపత్యాన్ని నియంత్రించేందుకు అమలు చేసిన ఆంక్షలను అనుసరించి ఈ మొత్తం జరిమానా విధించినట్టు ఈయూ పేర్కొంది. అయితే, ఈయూ జరిమానా నిర్ణయం వల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన రెసిప్రోకల్ టారిఫ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉంది. గతంలో ట్రంప్ అమెరికా కంపెనీలకు జరిమానా విధించే దేశాలపై సుంకాలు వేస్తామని బెదిరించారు.

ఐఫోన్‌లో ఉండే యాప్‌లకు ప్రత్యామ్నాయంగా ఇతర యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలు లేకుండా కంపెనీ పరిమితులు విధించిందని ఈయూ తన పరిశోధనలో తేల్చింది. ఇది ఈయూ డీఎంఏ చట్టం నిబంధనలకు విరుద్ధం. అందుకనుగుణంగానే జరిమానా విధించినట్టు ఈయూ వివరించింది. దీనిపై స్పందించిన యాపిల్.. తమ వినియోగదారుల గోప్యత, భద్రతకు చాలా ప్రాముఖ్యత ఇస్తాం. నిబంధనల పేర తమ టెక్నాలజీని ఉచితంగా ఇవ్వమని బలవంతం చేయడం ద్వారా ఈయూ యాపిల్‌ను టార్గెట్ చేస్తున్నట్టు భావిస్తున్నామని తెలిపింది. దీనిపై కోర్టులో సవాలు చేస్తామని స్పష్టం చేసింది. మెటా విషయంలోనూ.. వ్యక్తిగత డేటా ఇవ్వకుండా ప్లాట్‌ఫామ్ సేవలు వాడుకునే వీలు కల్పించాలని ఈయూ నిబంధనలు చెబుతున్నాయి. ఇందులో విఫలమైనందునే జరిమానా జరిమానా విధించినట్టు ఈయూ వివరించింది. ఈ అంశంపై తాము కూడా సవాలు చేస్తామని మెటా పేర్కొంది.

Next Story