EPFO: జనవరి నుంచి అమల్లోకి రానున్న ఈపీఎఫ్ఓ ఏటీఎం విత్‌డ్రా సదుపాయం

by S Gopi |

అక్టోబర్ రెండో వారంలో జరిగే సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశంలో తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు.

EPFO: జనవరి నుంచి అమల్లోకి రానున్న ఈపీఎఫ్ఓ ఏటీఎం విత్‌డ్రా సదుపాయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సబ్‌స్క్రైబర్లు ఏటీఎం నుంచి పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి దీన్ని ప్రారంభించాలని ఈఎపీఎఫ్ఓ భావిస్తోంది. దీనికి సంబంధించి తుది నిర్ణయాన్ని అక్టోబర్ రెండో వారంలో జరిగే సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశంలో తీసుకోనున్నారు. తొలుత ఈ ఏడాది జూన్ నుంచే ఈ సదుపాయాన్ని తీసుకొస్తామని కార్మిక శాఖ ప్రకటించింది. కానీ, విత్‌డ్రా పరిమితి విషయంపై బోర్డు ట్రస్టీల సమావేశంలో చర్చించాల్సి రావడంతో వాయిదా పడింది. విత్‌డ్రా పరిమితి విధించకపోవడం వల్ల ఈపీఎఫ్ఓ ప్రాథమిక లక్ష్యానికి విఘాతం ఏర్పడుతుందనే ఆండోళన వ్యక్తమైంది. అందుకే బోర్డు తుది నిర్ణయం కోసం వేచి ఉన్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పరిధిలో 7.8 కోట్ల మంది చందాదారులు ఉండగా, వీరందరికి చెందిన దాదాపు రూ. 28 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఈపీఎఫ్ఓ వద్ద ఉన్నాయి. అత్యవసర సమయంలో నగదు అవసరాలను తీర్చేందుకు పీఎఫ్ నుంచి కొంత మొత్తం విత్‌డ్రా తీసుకునే సదుపాయాం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. దానికోసం కావాల్సిన ఐటీ మౌలిక సదుపాయాలను కూడా తీసుకొచ్చింది. ఏటీఎం తరహాలో ప్రత్యేక కార్డును చందాదారులకు ఇవ్వడం ద్వారా దీన్ని అమలు చేయవచ్చని నిర్ణయించారు.

Next Story