Elon Musk: అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లు: దావోస్‌లో ఎలాన్ మస్క్

by S Gopi |

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), రోబోల భవిష్యత్తు గురించి మాట్లాడిన ఎలన్ మస్క్.. ఈ సాంకేతికతలు త్వరలో మనం జీవించే, పని చేసే విధానాన్ని మారుస్తాయని అన్నారు.

Elon Musk: అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లు: దావోస్‌లో ఎలాన్ మస్క్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ దావోస్ కేంద్రంగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్) కార్యక్రమంలో తొలిసారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను మస్క్ ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), రోబోల భవిష్యత్తు గురించి మాట్లాడిన ఎలన్ మస్క్.. ఈ సాంకేతికతలు త్వరలో మనం జీవించే, పని చేసే విధానాన్ని మారుస్తాయి. ఏఐ భూమ్మీద ఉన్న మానవుల కంటే తెలివైనదిగా మారగలదని, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు, పరిశ్రమలను పునర్నిర్మించగలదని అన్నారు.

అంతరిక్షంలో ఏఐ

ఈ సందర్భంగా.. సమీప భవిష్యత్తులో ఏఐ ఆధారిత డేటా సెంటర్‌లను అంతరిక్షంలో నిర్మించవచ్చని మస్క్ అన్నారు. ప్రస్తుతం, ఏఐ వ్యవస్థలకు భారీ మొత్తంలో ఎనర్జీ, కూలింగ్ అవసరం, వీటిని భూమిపై అందించడం కష్టం. అంతరిక్షంలో అన్నివేళలా లభించే సూర్యకాంతి, నేచురల్ కూలింగ్‌తో ఏఐ కంప్యూటర్లు మరింత చౌకగా, ప్రభావవంతంగా పనిచేయగలవని మస్క్ అభిప్రాయపడ్డారు. చాలామంది శాస్త్రవేత్తలు ఇది ఇప్పటికీ భవిష్యత్తుకు సంబంధించినదని చెబుతున్నప్పటికీ, మరో కొన్ని సంవత్సరాలలో ఇది జరగవచ్చని నమ్ముతున్నట్టు మస్క్ తెలిపారు.

నిజ జీవితంలో రోబోలు

తన కంపెనీలు 'ఆప్టిమస్' అనే హ్యూమనాయిడ్ రోబోట్ల తయారీలో వేగంగా పురోగతి సాధిస్తున్నాయని మస్క్ స్పష్టం చేశారు. ఈ రోబోట్లను నిజ జీవితంలో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్యాక్టరీలలో పనిచేయడం, దుకాణాలలో సహాయం చేయడం లేదా సాధారణ రోజువారీ పనులు చేయడం వంటి మనుషుల పనులను చేయడానికి ఆప్టిమస్‌ను నిర్మిస్తున్నాం. ఈ రోబోట్లు త్వరలోనే రోజువారీ జీవితంలోకి వస్తాయని, ప్రజలకు వారి రోజువారి పనులలో సహాయపడతాయని వెల్లడించారు.

Next Story