- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EV Sales: ఈవీ అమ్మకాల్లో మళ్లీ పుంజుకున్న ఉత్సాహం
గత నెలలో దేశవ్యాప్తంగా ఈవీ అమ్మకాలు ఏకంగా 93 శాతం పెరిగాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) అమ్మకాలు తిరిగి పుంజుకుంటున్నాయి. గత కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న ఈవీ డిమాండ్ జూలైలో భారీగా పెరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత నెలలో దేశవ్యాప్తంగా ఈవీ అమ్మకాలు ఏకంగా 93 శాతం పెరిగాయి. సమీక్షించిన నెలలో మొత్తం 15,528 ఈవీ కార్లు విక్రయాలు నమోదవగా, గతేడాది జూలైలో 8,037 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇందులో ఏకంగా 6,047 ఈవీ కార్లను విక్రయించి టాటా మోటార్స్ ఆధిపత్యం కొనసాగించింది. గతేడాది కంపెనీ జూలైలో 5,100 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అయితే, టూ-వీలర్ విభాగంలో అమ్మకాలు నెమ్మదించాయి. గత సంవత్సరం ఇదే నెలలో 1,07,655 యూనిట్లతో పోలిస్తే ఈ జూలైలో 1,02,973 యూనిట్లకు అమ్మకాలు పడిపోయాయి. ఈ విభాగంలో టీవీఎస్ మోటార్ కంపెనీ 22,256 యూనిట్ల రిజిస్ట్రేషన్లతో అగ్రస్థానంలో ఉంది. గతేడాది జూలైలో 19,655 యూనిట్లతో పోలిస్తే 13 శాతం పెరిగాయి. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ 63,675 యూనిట్ల నుంచి 9 శాతం పెరిగి 69,146 యూనిట్లకు చేరాయి. ఈ విభాగంలో 9,766 యూనిట్ల విక్రయాలతో మహీంద్రా గ్రూప్ అగ్రస్థానంలో ఉంది. గతేడాది కంటే మహీంద్రా 40 శాతం ఎక్కువ అమ్మకాలను సాధించింది. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన రిటైల్ అమ్మకాలు జూలైలో 52 శాతం పెరిగి 1,244 యూనిట్లకు చేరాయి. ఈ సెగ్మెంట్‌లోనూ టాటా మోటార్స్ 333 యూనిట్లతో ముందుంది. దేశవ్యాప్తంగా మళ్లీ ఈవీలకు డిమాండ్ పెరుగుతోందనడానికి ఈ డేటా సంకేతమని, ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు, ఫైనాన్స్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కారణంగా అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ వెల్లడించారు.






