- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Economic Survey: ఈసారి జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం
2026-27లో భారత జీడీపీ 6.8 శాతం నుంచి 7.2 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సర్వేను గురువారం పార్లమెంట్‌లో సమర్పించారు. కేంద్ర బడ్జెట్ వెలువరించేందుకు ఒకరోజు ముందు సాంప్రదాయంగా వస్తున్న ఆర్థిక సర్వే ఈసారి రెండు రోజుల ముందు సభలో ఉంచారు. ఈసారి బడ్జెట్ ప్రకటన వారాంతం వస్తుండటంతో ఆర్థిక సర్వేను ముందుగానే ప్రవేశపెట్టారు. గడిచిన ఏడాది కాలానికి సంబంధించి దేశ ఆర్థికవ్యవస్థ పనితీరు, భవిష్యత్తు కోసం కీలకమైన అంచనాలు, విధాన పరమైన సూచనలను ఈ అర్వే అందిస్తుంది. రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎదుర్కోవాల్సిన సవాళ్లను అంచనా వేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎకనమిక్ అఫైర్స్ విభాగం దీన్ని రూపొందిస్తుంది. 1950 నుంచి దీన్ని బడ్జెట్‌తో పాటే అందిస్తున్నప్పటికీ 1960 తర్వాత నుంచి బడ్జెట్ ప్రకటనకు ఒకరోజు ఉండగా సభ ముందుంచుతున్నారు. ఆర్థిక సర్వే దేశ ఆర్థికవ్యవస్థ ముందుకెళ్లేందుకు, గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన మార్పులను పరిగణలోకి తీసుకుని, సమీక్షిస్తూనే భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తుంది.
జీడీపీ వృద్ధి
2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.8 శాతం నుంచి 7.2 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇది ఇటీవల గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 7.4 శాతం వృద్ధి కంటే కొద్దిగా తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గతేడాది ఆర్థిక సర్వే జీడీపీ వృద్ధిని 6.3 శాతం నుంచి 6.8 శాతం పరిధిలో అంచనా వేసింది. అయితే, అధిక వినియోగం, ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా వాస్తవ జీడీపీ వృద్ధి అంతకుమించి ఉండే అవకాశం ఉంది. సుమారు 7 శాతం స్థిర వృద్ధితో, భారత్ వరుసగా నాలుగో ఏడాది కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.
ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం వరుస త్రైమాసికాల్లో తక్కువగానే నమోదవుతోందని ఆర్థిక సర్వే పేర్కొంది. గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య సగటు ద్రవ్యోల్బణం 1.7 శాతంగా ఉంది. ఇది సీపీఐ డేటా ప్రారంభం నుంచి ఇప్పటివరకు భారత్ అత్యల్ప ద్రవ్యోల్బణ రేటును నమోదు చేసింది. దీనికి తక్కువ ఆహార ద్రవ్యోల్బణం ప్రధాన కారణం. అంతేకాకుండా, గతేడాదిలో ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే మనదేశం ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా తగ్గించగలిగిందని ఆర్థిక సర్వే తెలిపింది.
ప్రజారోగ్యంపై శ్రద్ధ
దేశంలో పెరుగుతున్న ఒబెసిటీ సమస్యను నిలువరించి, ప్రజారోగ్యం మెరుగుపడేందుకు ఆర్థిక సర్వే పలు కీలక ప్రతిపాదనలు చేసింది. అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆల్ట్రా ప్రాసెస్‌డ్ ఫుడ్స్ వినియోగంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక సర్వే కీలక ప్రతిపాదనలు చేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ యాడ్స్‌పై నిషేధం విధించే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. అంతేకాకుండా చిన్నారులు, పసిపిల్లల పాల ఉత్పత్తులు, డ్రింక్స్ మార్కెటింగ్‌పై కూడా ఆంక్షలు విధించాలని కోరింది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలపై వార్నింగ్ లేబులింగ్ ఉండేలా చూడాలని, పిల్లలను లక్ష్యంగా చేసుకునే మార్కెటింగ్‌ను కట్టడి చేయాలని, వాణిజ్య ఒప్పందాలు ప్రజారోగ్య విధానాన్ని బలహీనపరచకుండా చూసుకోవాలని సర్వే సూచించింది.
ఏఐతో జాగ్రత్త
పారదర్శకతను పెంపొందించడం, ఏఐ భద్రతా సమస్యలపై సమన్వయం, అవగాహన పెంపొందించడానికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆర్థిక సర్వే పిలుపునిచ్చింది. సోషల్ మీడియాలో ఏఐ-సంబంధిత నకిలీ కంటెంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. పారదర్శకతను పెంచడం ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి అని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇది ప్రజా ప్రయోజనాలను కాపాడటానికి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై నమ్మకాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని తెలిపింది.
ఇదే సమయంలో సాంకేతిక రంగంలో నెలకొంటున్న కొత్త ఆవిష్కరణలు తీవ్ర సంక్షోభానికి దారి తీయవచ్చని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ముఖ్యంగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో వస్తున్న భారీ మార్పుల వల్ల 2008 నాటి ఆర్థిక సంక్షోభం కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందని అభిప్రాయపడింది. ఇది దేశ ఐటీ ఆధారిత వైట్-కాలర్ జాబ్ ఇంజిన్‌కు ప్రత్యక్ష ముప్పుగా పరిణమిస్తుంది. అయితే, ఈ ప్రమాదం ఎదురయ్యేందుకు 10-20 శాతం వరకు అవకాశాలు ఉండొచ్చని పేర్కొంది. ఏఐ ప్రభావం తీవ్రంగా ఉన్నా సరే, ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు తొలగవు. తక్కువ ఖర్చుతో భారత ఐటీ సేవలు పొందే విదేశీ కంపెనీలు వాటిని ఏఐ ద్వారా భర్తీ చేయడం వల్ల ముప్పు ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని ఆర్థిక సర్వే సూచించింది.
గిగ్ ఎకానమీపై..
దేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న గిగ్ ఎకానమీకి సంబంధించి ఆర్థిక సర్వే కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు 37 లక్షలకు పైగా గిగ్ వర్కర్లను తీసుకోగా, లాజిస్టిక్స్ (15 లక్షలు), బీఎఫ్ఎస్ఐ, తయారీ (ఒక్కొక్కటి 10 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. 2021లో 77 లక్షలుగా గిగ్ వర్కర్లు 2025 నాటికి 55 శాతం ఎక్కువగా 1.2 కోట్లకు పెరిగారు. అయితే, వీరిలోని 40 శాతం మంది నెలకు రూ. 15 వేల కంటే తక్కువ వేతనం తీసుకుంటున్నారు. గిగ్ ఎకానమీ వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆదాయంలో వ్యత్యాసం ఎక్కువగా ఉంది. ఇది ఈ వ్యవస్థలో రావాలని విధానపరమైన మార్పులను సూచిస్తుంది. దీనికోసం గిగ్ వర్కర్లకు న్యాయమైన వేతనం, గంటకు లేదా పనికి తగిన ఆదాయం ఇవ్వాలని అభిప్రాయపడింది. ఆర్థికంగా గిగ్ వర్కర్లు వెనుకబడి ఉన్నారని, రుణాలు పొందడంలోనూ వారికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని, రానున్న రోజుల్లో గిగ్ ఎకానమీ విధానాల్లో మార్పుల లక్ష్యంగా నిర్ణయాలు ఉండాలని వెల్లడించింది.
ఇతర ముఖ్యమైన అంశాలు
* అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 4.4 శాతంగా ఉండోచ్చని అంచనా వేసింది. ఇది అంతకుముందు 2024-25లోని 4.8 శాతం కంటే కొంచెం తక్కువ.
* మేక్ ఇన్ ఇండియా 2.0పై దృష్టి సారించడం ద్వారా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు అందిస్తున్నట్టు పేర్కొంది.
* వికసిత్ భారత్‌ను చేరుకోవడంలో వ్యవసాయ రంగం కీలకపాత్ర పోషిస్తోంది.
* డిజిటల్ సేవలకు సంబంధించి పట్టణాలు, గ్రామాల మధ్య అంతరం క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
* దేశ జీడీపీలో 30 శాతం వాటాతో అత్యంత పటిష్టంగా పెట్టుబడి కార్యకలాపాలు.
* దేశ ఆర్థిక లోటు క్రమంగా తగ్గుతోంది. మునుపటి సంవత్సరాలలో అధిక స్థాయిల నుంచి 2025-26లో దాదాపు 4.4 శాతంగా ఉంది.
* అదుపులో కరెంట్ అకౌంట్ లోటు.
* రికార్డు స్థాయిల్కి సేవల ఎగుమతులు. ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ఎగుమతి వాటా పెరిగిందన్న ఆర్థిక సర్వే.
* మెరుగ్గా దేశ బ్యాంకింగ్ రంగం. దశాబ్దాల కనిష్ట స్థాయికి చేరిన నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు).
* తయారీ, సేవల రంగాల్లో మెరుగైన ఉత్పత్తి కొనసాగుతోంది.






