- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DGCA: 48 గంటల్లోపు ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఇవ్వాల్సిందే
టికెట్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల పాటు 'లుక్-ఇన్ ఆప్షన్ 'ను ఎయిర్‌లైన్ కంపెనీలు అందించాలి

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులకు డీజీసీఏ శుభవార్త చెప్పింది. విమాన టికెట్ల రిఫండ్ విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు రద్దు చేసుకున్న ప్రయాణికులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. టికెట్‌లో మార్పులను కూడా ఉచితంగా చేసుకోవచ్చని తెలిపింది. కానీ, దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు డీజీసీఏ విమానయాన సంస్థల టిక్కెట్ల వాపసు నిబంధనలకు సంబంధించి పలు సవరణలను ప్రకటించింది. దీని ప్రకారం, టికెట్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల పాటు 'లుక్-ఇన్ ఆప్షన్ 'ను ఎయిర్‌లైన్ కంపెనీలు అందించాలి. ఆ సమయంలో ప్రయాణికులు అదనపు ఛార్జీలేవీ చెల్లించకుండా టికెట్ రద్దు చేయడం లేదంటే మార్పులు చేసుకునే సదుపాయం ఉంటుంది. అయితే, ఎంచుకున్న కొత్త తేదీకి టికెట్ ధర మారి ఉంటే, ఆ మేరకు చెల్లించాల్సిందే. అలాగే, టికెట్‌ను నేరుగా విమానయాన సంస్థ అధికారిక వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకున్న ప్రయాణికులు, 24 గంటల్లోపు పేరులో మార్పులు చేసుకోవచ్చు. అందుకు వారు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన పనిలేదు.
ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్ కొనుగోలు చేసిన సమయంలో రిఫండ్ చేయాల్సిన బాధ్యత విమానయాన సంస్థలదేనని, 14 పని దినాల్లోగా చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని వెల్లడించింది. దేశీయ విమానాల్లో ప్రయాణ తేదీకి 7 రోజులకు ముందు బుక్ చేసుకున్న టికెట్‌కు ‘లుక్-ఇన్ ఆప్షన్’ ఉండదు. అంతర్జాతీయ విమానాల్లో అయితే ఆ గడువు 15 రోజులుగా నిర్ణయించారు. అదేవిధంగా, ప్రయాణికుడు లేదా అదే పీఎన్‌ఆర్ నంబర్ ఉన్న టికెట్‌లో పేరు ఉండే కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రయాణ తేదీ రోజు ఆసుపత్రిలో ఉంటే రిఫండ్ లేదా క్రెడిట్ షెల్ ఆప్షన్ అడగొచ్చు. ఇతర అనారోగ్య, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల అభ్యర్థన మేరకు ఏరో స్పేస్ మెడిసిన్ నిపుణులు లేదా డీజీసీఏ ఎంప్యానెల్డ్ ఏరో స్పేస్ మెడిసిన్ నిపుణుల సలహా ద్వారా ఎయిర్‌లైన్ కంపెనీలు రీఫండ్ జారీ చేయవచ్చని వెల్లడించింది.






