- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Brent Crude: 126 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్
డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా మరింత క్షీణించి 106 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. దీనికి ప్రధాన కారణం హోర్ముజ్ జలసంధి చుట్టూ ఆందోళన పెరగడమే.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమవుతుందనే భయాలతో చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ప్రపంచ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 126.41 డాలర్ల వరకు చేరి నాలుగేళ్ల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత ట్రేడింగ్ నెమ్మదించడంతో అది 115.8 డాలర్లకు తగ్గినప్పటికీ, యుద్ధానికి ముందున్న 73 డాలర్ల స్థాయితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. అదే సమయంలో డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా మరింత క్షీణించి 106 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. దీనికి ప్రధాన కారణం హోర్ముజ్ జలసంధి చుట్టూ ఆందోళన పెరగడమే. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం గుండా జరుగుతుంది. ఇది అంతరాయం కలిగితే గ్లోబల్ సరఫరా తీవ్రంగా దెబ్బతింటాయి. షిప్పింగ్ డేటా ప్రకారం, ఈ మార్గంలో ట్యాంకర్ల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. దీన్ని అంతర్జాతీయ ఇంధన సంస్థ చరిత్రలోనే అతిపెద్ద సరఫరా అంతరాయంగా అభివర్ణించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
గ్లోబల్ క్రూడ్ ధరల పెరుగుదల ప్రభావం ఇప్పటికే వినియోగదారులపై పడుతోంది. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు గ్యాలన్‌కు 4.30 డాలర్లతో నాలుగేళ్ల గరిష్ఠాన్ని తాకాయి. దీని ప్రభావం కేవలం ఇంధనంతోనే పరిమితం కాలేదు. ప్లాస్టిక్‌లు, సింథటిక్ ఉత్పత్తులు, టెక్స్‌టైల్స్, ఆహార సరఫరా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాలు, దిగుమతి ఇంధనంపై ఆధారపడే మనదేశం లాంటి ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే చమురు కొరత, ధరల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్లేషకుల ప్రకారం, సరఫరాలో దీర్ఘకాలిక అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్ మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చమురు ధరలను మరింత అస్థిరంగా మారుస్తున్నాయి. ఈ సంక్షోభం త్వరగా పరిష్కారం కాకపోతే, గ్లోబల్ మార్కెట్లు ఇంకా ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది.






