FMCG: ఎంఆర్‌పీ తగ్గించలేమంటున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు

by S Gopi |

ధరలను తగ్గించడం వల్ల వినియోగదారులకు లావాదేవీ సమస్యలు ఉంటాయని..

FMCG: ఎంఆర్‌పీ తగ్గించలేమంటున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు ఎఫ్ఎంసీజీ కంపెనీలకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. జీఎస్టీ తగ్గింపులకు అనుగుణంగా తక్కువ విలువైన ఉత్పత్తుల రిటైల్ ధరలను తగ్గించలేమని కంపెనీలు చెబుతున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) అధికారులకు తెలియజేశాయి. ఇప్పుడున్న ధరలను తగ్గించడం వల్ల వినియోగదారులకు లావాదేవీ సమస్యలు ఉంటాయని, అందుకు బదులుగా ప్యాకేజీ పరిమాణం పెంచుతామని కంపెనీలు ప్రతిపాదించాయి. ప్రధానంగా రూ. 5, రూ. 10, రూ. 20 ధరలకు విక్రయించే బిస్కెట్లు, సబ్బులు, టూత్‌పేస్ట్ వంటి నిత్యావసర వస్తువుల విషయంలో కంపెనీలు ధరలు తగ్గించేందుకు ఇష్టపడటంలేదు. ఉదాహరణకు రూ. 20 విలువైన బిస్కెట్‌పై జీఎస్టీ ఇదివరకు 18 శాతం ఉండగా, ఇప్పుడు 5 శాతం పరిధిలోకి వచ్చింది. తద్వారా దీని ధర రూ. 20 నుంచి రూ. 17.80 లేదా రూ. 18కి తగ్గుతుంది. సాధారణంగా రూ. 18 అనేది రోజువారీ ఉపయోగించే వస్తువులకు ఉండాల్సిన ధర కాదు. ముఖ్యంగా భారత్ లాంటి మార్కెట్లో అసమాన ధరలో ఉత్పత్తులను ఉంచడం వల్ల గిరాకీపై ప్రభావం చూపుతుంది. దీన్ని మార్చాలని అనుకోవట్లేదని ఎఫ్ఎంసీజీ కంపెనీ బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రిషబ్ జైన్ అన్నారు. దీనికి పరిష్కారంగా ధరలను అలాగే ఉంచి, ప్యాక్ చేసిన ఉత్పత్తుల పరిమాణాన్ని దామాషా పద్దతిలో మార్చుకోవడం సరైన నిర్ణయం. అంటే, రూ. 20 బిస్కెట్ ప్యాక్ బరువు గతంలో కంటే కొంత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

అయితే, ప్రస్తుతానికి కంపెనీలు జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు ఖచ్చితంగా అందజేస్తాయని, దీనివల్ల వినియోగం గణనీయంగా పెరుగుతుందని కాబట్టి తగ్గింపు విషయంలో ఎలాంటి సందేహం లేదని డాబర్ ఇండియా సీఈఓ మోహిత్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇది ధరల తగ్గింపు సమస్య కాదు, మార్కెట్లో సదరు తక్కువ విలువైన వస్తువులు చొచ్చుకుపోవడం, వాటికి కస్టమర్లు అలవాటు పడటమని కంపెనీలు వివరిస్తున్నాయి. మనది తక్కువ-ఆదాయ, తక్కువ-మధ్యతరగతి కుటుంబాలు ఉన్న దేశం కావడంతో రూ. 5, రూ. 10 వంటి ధరలు మార్కెట్లో యాక్సెస్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయని వివరిస్తున్నాయి.

Next Story