Online Food: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లో మోసపోయారా.. ఫిర్యాదు ఎలా చేయాలో తెలుసా?

by S Gopi |

ముఖ్యంగా కలుషిత ఆహారం, గడువు ముగిసిన ఉత్పత్తులు, నాణ్యత లేని వస్తువులు, నిల్వ ప్రమాణాలు పాటించకపోవడం వంటి ఆరోపణలు ఈ ప్లాట్‌ఫామ్‌ల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Online Food: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లో మోసపోయారా.. ఫిర్యాదు ఎలా చేయాలో తెలుసా?
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్ని సంవత్సరాలుగా స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, జెప్టో, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు కోట్లాది మంది జీవితాల్లో భాగమయ్యాయి. ఇంటి వద్దకే నిమిషాల్లో ఆహారం, కిరాణా వస్తువులు అందించడం వల్ల వినియోగదారుల ఆదరణ కూడా భారీగా పెరిగింది. అయితే, వినియోగదారుల సంఖ్య పెరిగిన కొద్దీ ఫిర్యాదుల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా కలుషిత ఆహారం, గడువు ముగిసిన ఉత్పత్తులు, నాణ్యత లేని వస్తువులు, నిల్వ ప్రమాణాలు పాటించకపోవడం వంటి ఆరోపణలు ఈ ప్లాట్‌ఫామ్‌ల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) శనివారం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు తొమ్మిది నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. ఈ పరిణామం ఫుడ్ డెలివరీ రంగంలో నాణ్యత నియంత్రణపై మరోసారి చర్చకు దారితీసింది.

సోషల్ మీడియా.. వినియోగదారుడికి కొత్త ఆయుధం

ఎఫ్ఎస్ఎస్ఏఐ మాజీ సభ్యుడు బెజోన్ మిశ్రా అభిప్రాయం ప్రకారం, సోషల్ మీడియా వల్ల వినియోగదారుల అవగాహన గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి ముందు ఏ అంశాలను పరిశీలించాలి, సమస్య ఎదురైతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి వంటి విషయాలు ఇప్పుడు ఎక్కువ మందికి తెలిసివస్తున్నాయి. 2005 నుంచి వినియోగదారుల వ్యవహారాల శాఖ చేపట్టిన 'జాగో గ్రాహక్ జాగో' ప్రచారం కూడా ప్రజల్లో హక్కులపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.

మోసపోతే ఊరుకోవద్దు.. ఇలా ఫిర్యాదు చేయండి

గతంలో లాగా నాసిరకం వస్తువులు వస్తే భరించాల్సిన అవసరం లేదు. 'జాగో గ్రాహక్ జాగో' వంటి ప్రచారాల వల్ల నేడు వినియోగదారుల్లో అవగాహన పెరిగింది. మీకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల్లో ఎలాంటి చేదు అనుభవం ఎదురైనా, ఈ కింది అధికారిక మార్గాల ద్వారా తక్షణమే ఫిర్యాదు చేయవచ్చు:

ఎఫ్ఎస్ఎస్ఏఐ హెల్ప్‌లైన్: నేరుగా టోల్ ఫ్రీ నంబర్ 1800-112-100కు కాల్ చేసి మీ సమస్యపై ఫిర్యాదు చేయవచ్చు.

ఈమెయిల్ ద్వారా: పూర్తి వివరాలతో [email protected]కు ఈమెయిల్ రాయవచ్చు.

నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (ఎన్‌సీహెచ్): ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య 1915 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

చివరి అస్త్రం.. సీపీగ్రామ్స్ పోర్టల్

ఒకవేళ పైన పేర్కొన్న కంపెనీల నుంచి లేదా హెల్ప్‌లైన్ల ద్వారా తగిన న్యాయం, పరిష్కారం లభించకపోతే మరో బలమైన మార్గం ఉంది. వినియోగదారులు నేరుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీపీగ్రామ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. దేశ ప్రధాన మంత్రి పర్యవేక్షణలో ఉండే ఈ డిజిటల్ పోర్టల్ వారంలో 7 రోజులూ, రోజుకు 24 గంటలూ పనిచేస్తుంది. ఇందులో నమోదయ్యే ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు ఉంటాయి.

Next Story