Gig Workers: గిగ్ కార్మికుల సామాజిక భద్రతకు 90 రోజుల పని నిబంధన

by S Gopi |

ఒక రోజుకు ఒక అగ్రిగేటర్‌ వద్ద పని చేసినా,ఆ రోజు మొత్తం ఒక రోజుగా పరిగణలోకి వస్తుంది.

Gig Workers: గిగ్ కార్మికుల సామాజిక భద్రతకు 90 రోజుల పని నిబంధన
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం గిగ్‌వర్కర్లకు సంబంధించిన సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించేందుకు కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ ప్రయోజనాలు పొందడానికి ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అగ్రిగేటర్‌ వద్ద కనీసం 90 రోజులు లేదా ఒకటి కంటే ఎక్కువ అగ్రిగేటర్ల వద్ద మొత్తం 120 రోజులు పనిచేయాలి. ఇటీవల గిగ్‌వర్కర్లు సామాజిక భద్రత, మెరుగైన వేతనాలను డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం ముసాయిదా నిబంధనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఒక రోజుకు ఒక అగ్రిగేటర్‌ వద్ద పని చేసినా,ఆ రోజు మొత్తం ఒక రోజుగా పరిగణలోకి వస్తుంది. ఒక గిగ్‌వర్కర్ అగ్రిగేటర్ కోసం చేసిన పనికి ఆదాయం సంపాదిస్తే, వారు ఎంత సంపాదించారనే దానితో సంబంధం లేకుండా, ఆ రోజున వారు పనిలో చేసినట్లుగా పరిగణలోకి వస్తుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

ముసాయిదా పత్రంలోని వివరాలు..

* ఒక గిగ్‌వర్కర్ ఒకరోజు ఒక అగ్రిగేటర్ కోసం చేసిన పనికి ఎంత ఆదాయం సంపాదించినా, ఆ మొత్తంతో సంబంధం లేకుండా, వారు ఒక రోజు పాటు పనిలో ఉన్నట్లుగా పరిగణలోకి వస్తుంది.

* ఒక గిగ్‌వర్కర్ ఎక్కువ అగ్రిగేటర్ల వద్ద పనిచేస్తే, పనిచేసిన రోజుల సంఖ్య అన్ని అగ్రిగేటర్ల నుంచి కలిపి లెక్కిస్తారు.

* ఒక గిగ్‌వర్కర్ ఒకే రోజున ముగ్గూ అగ్రిగేటర్లతో పనిచేస్తే, అది మూడు వేర్వేరు పని దినాలుగా లెక్కిస్తారు.

* అగ్రిగేటర్‌తో కలిసి లేదా పరోక్షంగా పనిచేసే వారిని సైతం గిగ్‌వర్కర్లుగా గుర్తించనున్నారు.

* ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సామాజిక భద్రతా ప్రయోజనాలు లభిస్తాయి.

ఈ ముసాయిదా నిబంధనలకు సంబంధించి తుది నోటిఫికేషన్‌కు ముందు అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం కోరింది. 30-45 రోజుల వ్యవధిలో అభ్యంతరాలు మరియు సూచనలను ఆహ్వానించింది. ఏప్రిల్ 1 నుంచి నాలుగు లేబర్ కోడ్‌లలోని అన్ని నిబంధనలను పూర్తిగా అమలు చేయాలనే కార్మిక మంత్రిత్వ శాఖ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఇటీవల డిసెంబర్ 25, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న గిగ్‌వర్కర్లు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. సామాజిక భద్రత, మెరుగైన వేతనాలను వారు డిమాండ్ చేశారు. అలాగే, 10 నిమిషాల్లో డెలివరీ విధానాన్ని పూర్తిగా చేయాలని డిమాండ్ చేశారు.

Next Story