Exporters: ఎగుమతిదారులకు మద్దతుగా ప్యాకేజీ ఇచ్చే యోచనలో కేంద్రం

by S Gopi |

పూచీకత్తు లేని రుణాలు, సబ్సిడీ వడ్డీ రేట్లతో ఎగుమతిదారులకు నిధుల లభ్యతను సులభతరం చేయడానికి చర్యలను ప్రతిపాదించింది.

Exporters: ఎగుమతిదారులకు మద్దతుగా ప్యాకేజీ ఇచ్చే యోచనలో కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల దెబ్బతిన్న ఎగుమతిదారులకు మద్దతిచ్చేందుకు ప్యాకేజీ ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా ఉన్న మనదేశ ఎగుమతులకు ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పూచీకత్తు లేని రుణాలు, సబ్సిడీ వడ్డీ రేట్లతో ఎగుమతిదారులకు నిధుల లభ్యతను సులభతరం చేయడానికి చర్యలను ప్రతిపాదించింది. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో జరిగే సమావేశాల్లో మంత్రివర్గం ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో ఫిబ్రవరిలో వెలువడిన కేంద్ర బడ్జెట్‌లో ఎగుమతి ప్రమోషన్ కోసం ప్రభుత్వం కేటాయించిన రూ. 2,250 కోట్ల నుంచే ఈ ఉపశమన చర్యలకు నిధులు సమకూర్చనున్నట్టు తెలుస్తోంది. ఆసియాలో మరే దేశంపై లేని అధిక సుంకాలు మనపై ఉండటంతో వియత్నాం, బంగ్లాదేశ్ వంటి తయారీ దేశాలు మార్కెట్ వాటాను సొంతం చేసుకుంటున్నాయి. భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్. తాజా టారిఫ్ కారణంగా ఫ్యాషన్, ఆభరణాల వంటి శ్రమతో కూడిన వ్యాపారాలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. దీన్నుంచి ఎగుమతిదారులకు రక్షించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Next Story