E20 Fuel: ఏప్రిల్ 1 నుంచి ఈ20 పెట్రోల్ అమ్మకం తప్పనిసరి

by S Gopi |

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విక్రయించే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.

E20 Fuel: ఏప్రిల్ 1 నుంచి ఈ20 పెట్రోల్ అమ్మకం తప్పనిసరి
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విక్రయించే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ ఇంధనం కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ (ఆర్ఓఎన్) కలిగి ఉండాలని తెలిపింది. ఆర్ఓఎన్ అనేది వాహన ఇంజిన్ లోపల ఒత్తిడిని పెట్రోల్ ఎంత సమర్థవంతంగా నిర్వహించగలదో చూపించే సంఖ్య. ఇంజిన్ లోపల ఇంధనం అసమానంగా మండినప్పుడు, అది నాకింగ్ శబ్దాన్ని సృష్టిస్తుంది. దీన్ని ఇంజిన్ నాకింగ్ అంటారు. ఈ నాకింగ్ కాలక్రమేణా ఇంజిన్‌ను దెబ్బతీస్తుంది. ఆర్ఓఎన్ ఎంత ఎక్కువగా ఉంటే, ఇంధనం నాకింగ్‌ను అంత బాగా తట్టుకుంటుంది. సహజంగా, ఇథనాల్ అధిక ఆక్టేన్ విలువ(సుమారు 108 ఆర్ఓఎన్) ను కలిగి ఉంటుంది. కాబట్టి పెట్రోల్​లో 20 శాతం ఇథనాల్ వల్ల ఇంజిన్​ నాకింగ్​ను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. చమురు కంపెనీలు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం పరిమిత సమయం వరకు ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక మినహాయింపును ఇచ్చింది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్​ (బీఐఎస్​) ప్రమాణాల ప్రకారం, దేశవ్యాప్తంగా 20 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం, కనీసం ఆర్ఓఎన్95 కలిగిన పెట్రోల్​ను మాత్రమే చమురు సంస్థలు విక్రయించాలి.

Next Story