Budget-2025: బడ్జెట్‌లో సబ్సిడీల కేటాయింపును పెంచే యోచనలో కేంద్రం

by S Gopi |

రాబోయే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలపై ఎక్కువగా ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది.

Budget-2025: బడ్జెట్‌లో సబ్సిడీల కేటాయింపును పెంచే యోచనలో కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: రాబోయే యూనియన్ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలపై ఎక్కువగా ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆహారం, ఎరువులు, ఇంధనంపై సబ్సిడీ బిల్లులో దాదాపు 8 శాతం కోత పెట్టారు. దీన్ని ఈసారి బడ్జెట్‌లో భర్తీ చేసే అంశంపై సానుకూలంగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అధిక ఆహార, ఇంధన భారాన్ని తగ్గించేందుకు 2025-26 కేంద్ర బడ్జెట్‌లో ఆహారం, ఎరువులు, వంటగ్యాస్ సబ్సిడీలపై రూ. 4.1 లక్షల కోట్లకు(8 శాతం అధికం) పెంచనున్నట్టు సమాచారం. గడిచిన ఏడాది భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి నెమ్మదించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితుల మధ్య పట్టణ ప్రాంతాల్లో బలహీన వృద్ధి, కంపెనీల పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం వల్లనే ఆర్థికవ్యవస్థ నెమ్మదించింది. ఈ నేపథ్యంలో కీలకమైన గ్రామీణ ప్రాంతాలకు చేరే ప్రధాన సబ్సిడీలకు ఎక్కువ కేటాయింపుల ద్వారా వృద్ధికి ఊతమివ్వొచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది. వృద్ధి నెమ్మదిస్తున్న సమయంలో సబ్సిడీలను కొనసాగించడం ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. రైతుల నుంచి ఎక్కువ బియ్యం కొనుగోళ్లు, నిల్వ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆహార సబ్సిడీ బిల్లు దాదాపు 5 శాతం పెరిగి రూ. 2.15 లక్షల కోట్లకు పెంచనున్నారు. వంటగ్యాస్ సబ్సిడీలపై కేటాయింపులను రూ. 12 వేల కొట్ల నుంచి రూ. 25 వేల కోట్లకు పెంచనున్నారు. ఎరువుల సబ్సిడీని రూ. 1.7 లక్షల కోట్లతో గతంలో కేటాయించిన స్థాయిలోనే కొనసాగించవచ్చని ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి.

Next Story