- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Capgemini: వారానికి 47.5 గంటలు చాలు
రోజుకు 9.30 గంటలు పని చేయడం ద్వారా వారంలో ఐదు రోజులు పని చేస్తే చాలని అన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో : గత కొంతకాలంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగుల పని గంటలపై విస్తృతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వివిధ కంపెనీల అధినేతలు తమ వ్యాఖ్యలతో ఈ అంశాన్ని చర్చలో ఉంచుతున్నారు. తాజాగా ఐటీ సేవల సంస్థ క్యాప్‌జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్ది పని గంటలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రోజుకు 9.30 గంటలు పని చేయడం ద్వారా వారంలో ఐదు రోజులు పని చేస్తే చాలని అన్నారు. ఉద్యోగులు వారానికి 47.5 గంటల పనిని తాను సమర్ధిస్తానని, వారాంతాల్లో ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపడాన్ని తాను వ్యతిరేకనని చెప్పారు. మంగళవారం ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ నిర్వహించిన టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన.. నాలుగేళ్లుగా తాను ఇదే తరహా పని విధానాన్ని పాటిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో మాత్రమే వారాంతం పని చేస్తున్నానని, ఆ సమయంలోనూ ఉద్యోగులకు ఎలాంటి మెయిల్స్ పంపించనని చెప్పారు. వారాంతంలో ఉద్యోగిని ఇబ్బంది పెట్టి ప్రయోజనం ఉండదని, అందువల్ల తాను ఆ సమయంలో మెయిల్ పంపడం మానేసినట్టు వివరించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నాస్కామ్ ఛైర్‌పర్సన్ సింధు గంగాధరన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఎన్ని గంటలు పని చేస్తున్నారనే దానికంటే, ఉత్పాదకత అవసరమన్నారు. కాగా, గతంలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే దేశంలోని యువత వారంలో 70 గంటలు పని చేయాలని చెప్పిన మాటలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎల్అండ్‌టీ ఛరీం ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం దీనికి మరింత ఆజ్యం పోస్తూ వారంలో 90 గంటల పని చేయాలని చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.






