Railway Employees: రైల్వే ఉద్యోగులకు దసరా, దీపావళి బోనస్

by S Gopi |

ఉత్పాదకతతో కూడిన బోనస్ కింద రూ.1,866 కోట్లు చెల్లించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Railway Employees: రైల్వే ఉద్యోగులకు దసరా, దీపావళి బోనస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దసరా, దీపావళి సందర్భంగా భారీ బోనస్‌ను ప్రకటించింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఆమోదం లభించింది. రైల్వే ఉద్యోగుల అద్భుతమైన పనితీరును గుర్తిస్తూ, ఉత్పాదకతతో కూడిన బోనస్ కింద రూ.1,866 కోట్లు చెల్లించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిర్ణయంతో 10.9 లక్షలకు పైగా రైల్వే సిబ్బందికి ప్రయోజనం లభిస్తుందని, ఈ మొత్తం 78 రోజుల వేతనానికి సమానమైన మొత్తాన్ని కవర్ చేస్తుందని చెప్పారు. ప్రతి సంవత్సరం దసరా ముందు రైల్వే శాఖ ఉత్పాదకత-సంబంధిత బోనస్‌లను ఇస్తుంది. పనితీరును మెరుగుపరచడంలో ఉద్యోగుల పాత్రను గుర్తిస్తూ, వారికి మరింత ప్రోత్సాహం కల్పించడమే దీని లక్ష్యం.

ఉద్యోగులకు ఎంత లభిస్తుంది?

రైల్వే ఉద్యోగులను పనితీరును గౌరవిస్తూ, మరింత ప్రోత్సాహం కల్పించేందుకు ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి గరిష్టంగా రూ.17,951 బోనస్ ఇవ్వనున్నారు. పండుగ సీజన్‌కు ముందే దీన్ని చెల్లించనున్నారు. దీనివల్ల లక్షలాది రైల్వే సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం అందుతుంది.

ఎవరు అర్హులు

వివిధ విభాగాలకు చెందిన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇస్తారు. ఇందులో ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, హెల్పర్లు, పాయింట్‌మెన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ 'సి' కార్మికులు ఉన్నారు.

Next Story