- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Airlines: విమానయాన రంగానికి కేంద్రం ఊరట
ఇందుకోసం ఏకంగా రూ.10,000 కోట్లతో 'ప్రత్యేక ధరల స్థిరీకరణ నిధి'ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరల హెచ్చుతగ్గుల నుంచి ఎయిర్‌లైన్స్ కంపెనీలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.10,000 కోట్లతో 'ప్రత్యేక ధరల స్థిరీకరణ నిధి'ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడిస్తూ.. దీనివల్ల విమానయాన సంస్థలపై భారం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన ధరలు కేవలం రెండు నెలల్లోనే భారీగా పెరిగాయి. మార్చిలో లీటరు రూ.60.50 ఉన్న ధర, మే నాటికి ఏకంగా రూ.142కు ఎగబాకింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు వడ్డీ లేని అడ్వాన్సులు ఇచ్చి, ధరలు పెరిగినప్పుడు వచ్చే నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతిగా.. విమాన కంపెనీలు మూడేళ్ల పాటు ఈ ప్రభుత్వ ఆయిల్ కంపెనీల నుంచే ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
సాధారణంగా విమాన కంపెనీల మొత్తం ఖర్చుల్లో ఇంధనానికే 40 శాతం వరకు ఖర్చవుతుంది. కానీ ప్రస్తుత యుద్ధ పరిస్థితులు, పాకిస్తాన్ గగనతల మూసివేత వల్ల విమాన మార్గాలు దూరమై.. ఈ ఖర్చు ఏకంగా 60 శాతానికి చేరింది. ఈ భారం విమాన సంస్థలపై పడకుండా కేంద్రం తీసుకున్న ఈ చర్య విమానయాన సంస్థలకు అండగా నిలవనుంది. ఫలితంగా విమాన టికెట్ల ధరలు అదుపులో ఉంటాయని, సామాన్యులకు సైతం విమాన ప్రయాణం భారం కాకుండా ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.






