BSNL: స్వదేశీ 4జీ సేవలు ప్రారంభించనున్న బీఎస్ఎన్ఎల్

by S Gopi |

భవిష్యత్తులోనూ ఈ టెక్నాలజీ ద్వారా 5జీ సేవలకు సులభంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలుంటుందని కేంద్ర మంత్రి వివరించారు

BSNL: స్వదేశీ 4జీ సేవలు ప్రారంభించనున్న బీఎస్ఎన్ఎల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ శనివారం(సెప్టెంబర్ 27) స్వదేశీ 4జీ నెట్‌వర్క్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం వెల్లడించారు. స్వదేశీ 4జీ క్లౌడ్ ఆధారిత నెట్‌వర్క్‌తో పని చేస్తుందని, భవిష్యత్తులోనూ ఈ టెక్నాలజీ ద్వారా 5జీ సేవలకు సులభంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలుంటుందని కేంద్ర మంత్రి వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సేవలను అధికారికంగా ప్రారంభిస్తారు. దీంతో పాటు డిజిటల్ భారత్ నిధి కార్యక్రమంలో భాగంగా 100 శాతం 4జీ శాచురేషన్ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తారు. దీని వల్ల ఫిన్లాండ్, స్వీడన్, దక్షిణ కొరియా, చైనా తర్వాత ఈ నెట్‌వర్క్‌లో సొంత స్వదేశీ టెలికాం సాంకేతికత, పరికరాలను కలిగిన ఐదవ దేశంగా భారత్ నిలవనుంది. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 97,500 కంటే ఎక్కువ 4జీ మొబైల్ టవర్లను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఇది పూర్తిగా స్వదేశీ 4జీ టెక్నాలజీతో పనిచేస్తుంది. తేజస్ నెట్‌వర్క్స్ అభివృద్ధి చేసిన రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (ర్యాన్)ను కలిగి ఉంది. ఇది సీ-డాట్ (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) ద్వారా ఒక ప్రధాన నెట్‌వర్క్. ఇక, డిజిటల్ భారత్ నిధి ప్రాజెక్టు ద్వారా సుమారు 30 వేల గ్రామాలకు టెలికాం సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.

Next Story