Federal Bank: ఫెడరల్ బ్యాంకులో బ్లాక్‌స్టోన్ వాటా కొనుగోలుకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్

by S Gopi |

దీంతో ఫెడరల్ బ్యాంకులో 9.99 శాతం వరకు వాటాను కొనుగోలు చేయడానికి బ్లాక్‌స్టోన్ అనుమతులు పొందింది.

Federal Bank: ఫెడరల్ బ్యాంకులో బ్లాక్‌స్టోన్ వాటా కొనుగోలుకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ కంపెనీ దేశీయ ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్‌లో గణనీయమైన వాటా కొనుగోలు చేయనుంది. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నుంచి ఆమోదం సంపాదించుకుంది. దీంతో ఫెడరల్ బ్యాంకులో 9.99 శాతం వరకు వాటాను కొనుగోలు చేయడానికి బ్లాక్‌స్టోన్ అనుమతులు పొందింది. ఈ వాటా కొనుగోలుతో ఇది భారత ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అత్యంత కీలకమైన విదేశీ పెట్టుబడి కానుంది. ఇదివరకే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఈ ఒప్పందాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. బ్లాక్‌స్టోన్ ప్రత్యేక షేర్ల జారీ ద్వారా ఫెడరల్ బ్యాంక్‌లో సుమారు రూ. 6,197 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనికి సంబంధించి ఫెడరల్ బ్యాంక్ వారెంట్లను జారీ చేయనుంది. వాటిని భవిష్యత్తులో బ్లాక్‌స్టోన్ కంపెనీ షేర్లుగా మార్చుకుంటుంది. అన్ని వారెంట్లు షేర్లుగా మార్చుకున్న తర్వాత, బ్లాక్‌స్టోన్ బ్యాంకులో అతిపెద్ద ఏకైక వాటాదారుగా మారుతుంది. బ్లాక్‌స్టోన్ వాటా 5 శాతం కంటే ఎక్కువగా ఉంటే, బ్యాంక్ బోర్డులో ఒక డైరెక్టర్‌ను నామినేట్ చేయడానికి అనుమతి లభిస్తుంది. దీని అర్థం, బ్లాక్‌స్టోన్ బ్యాంకును నియంత్రించకపోయినప్పటికీ, బ్యాంకు నిర్ణయాలలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి పటిష్ఠంగా ఉంది. బ్యాంకు లాభాలు, రుణాలు, ఆదాయం మెరుగుపడ్డాయి. ఇదే సమయంలో బ్యాంకు మొండి బకాయిలు 10 ఏళ్ల కనిష్ఠానికి చేరాయి. ఈ నేపథ్యంలో బ్లాక్‌స్టోన్ ఒప్పందం భారతీయ బ్యాంకులపై విదేశీ ఇన్వెస్టర్లకు పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తుంది.

Next Story