Airtel: అదానీ డేటా నెట్‌వర్క్‌కు చెందిన మొత్తం స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్

by S Gopi |

ప్రస్తుతానికి ఈ ఒప్పందం రెండు కంపెనీల మధ్య మాత్రమే జరిగింది,

Airtel: అదానీ డేటా నెట్‌వర్క్‌కు చెందిన మొత్తం స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు అదానీ గ్రూప్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీకి అనుబంధంగా ఉన్న భారతీ హెక్సాకామ్ ద్వారా అదానీ డేటా నెట్‌వర్క్స్‌కు చెందిన 26గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో ఉన్న 400 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను వాడుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ కొనుగోలు ద్వారా కంపెనీ తన 5జీ సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా నెట్‌వర్క్‌ను కూడా పెంచుకునేందుకు వీలవుతుందని భావిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఒప్పందం రెండు కంపెనీల మధ్య మాత్రమే జరిగింది, నియంత్రణ సంస్థల నుంచి లభించే ఆమోదాలకు లోబడి లావాదేవీని పూర్తి చేయనున్నట్టు ఎయిర్‌టెల్ తన ఎక్స్ఛెంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, ఈ ఒప్పందానికి సంబంధించి ఆర్థిక వివరాలను కూడా కంపెనీ వెల్లడించలేదు. 2022, ఆగష్టులో జరిగిన స్పెక్ట్రమ్ వేలం సందర్భంగా అదానీ గ్రూపునకు చెందిన అదానీ డేటా నెట్‌వర్క్ రూ. 212 కోట్లకు 400 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఆరు సర్కిళ్లలో ఈ స్పెక్ట్రమ్ ఉంది. ఒప్పందంలో భాగంగా వాటిని ఎయిర్‌టెల్ వాడుకునేందుకు అవకాశం లభిస్తుంది. అందులో గుజరాత్(100 మెగాహెర్ట్జ్), ముంబై(100 మెగాహెర్ట్జ్), ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 50 మెగాహెర్ట్జ్ చొప్పున స్పెక్ట్రమ్ ఎయిర్‌టెల్ దక్కించుకుంటుంది. ఇప్పటికే ఉన్న దానికి అదనంగా ఎయిర్‌టెల్ దక్కించుకున్న తాజా స్పెక్ట్రమ్ యూజర్లకు అధిక స్పీడ్‌తో కూడిన డేటాను ఎయిర్‌టెల్ అందిస్తుంది. అంతేకాకుండా నెట్‌వర్క్ సామర్థ్యం మెరుగుపడి, కస్టమర్లకు నాణ్యమైన సేవలందించేందుకు వీలుంటుందని ఎయిర్‌టెల్ పేర్కొంది.

Next Story