Airtel: రెండో అత్యంత విలువైన కంపెనీగా ఎయిర్‌టెల్

by S Gopi |

ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ. 11.90 లక్షల కోట్లకు చేరుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ రూ. 11.74 లక్షల కోట్లుగా నమోదైంది.

Airtel: రెండో అత్యంత విలువైన కంపెనీగా ఎయిర్‌టెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కీలక మైలురాయిని చేరుకుంది. సోమవారం ట్రేడింగ్ సమయంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా హెచ్‌డీఎఫ్‌సీని అధిగమించి, దేశంలోనే రెండో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ. 11.90 లక్షల కోట్లకు చేరుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ రూ. 11.74 లక్షల కోట్లుగా నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రూ. 18 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది ఎయిర్‌టెల్ కంపెనీ షేర్లు మెరుగైన ర్యాలీని సాధిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎయిర్‌టెల్ షేర్లు సుమారు 7.5 శాతం మాత్రమే తగ్గగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 22 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. ముఖ్యంగా బ్యాంక్ ఛైర్మన్ వారసత్వంపై నెలకొన్న అనిశ్చితి, పార్ట్‌టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా వంటి పరిణామాలు ఇన్వెస్టర్ల ఆందోళనకు దారితీశాయి. దీంతో బ్యాంక్ షేర్లపై ఒత్తిడి కొనసాగుతోంది.

ఎయిర్‌టెల్ తన వ్యాపార విస్తరణపై దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవల త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ యాజమాన్యం, ప్రీమియం కస్టమర్లు, పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపింది. అలాగే ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ప్రస్తుతం 40 శాతం పైగా ఉన్న ప్రమోటర్ హోల్డింగ్‌ను వచ్చే దశాబ్దంలో 51 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇది ఎయిర్‌టెల్ దీర్ఘకాలిక వృద్ధిపై పెట్టుబడిదారుల్లో మరింత నమ్మకం పెంచింది.

Next Story