- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India-China: భారత ఈవీ పథకాలపై చైనా అక్కసు
భారత ప్రభుత్వం అందించే ప్రోత్సాహక పథకాలకు వ్యతిరేకంగా వివాద పరిష్కార ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)ను కోరడం ద్వారా చైనా భారత్‌తో తన వాణిజ్య వివాదాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: మరోసారి భారత్‌తో చైనా తగువుకు దిగింది. ముఖ్యంగా మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొచ్చిన పథకాలపై చైనా అక్కసు వెళ్లగక్కుతోంది. ద్వైపాక్షిక సంప్రదింపులు విఫలమైన తర్వాత, ఆటోమొబైల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారత ప్రభుత్వం అందించే ప్రోత్సాహక పథకాలకు వ్యతిరేకంగా వివాద పరిష్కార ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)ను కోరడం ద్వారా చైనా భారత్‌తో తన వాణిజ్య వివాదాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేసింది. 2025, నవంబర్ 25, 2026, జనవరి 6న జరిగిన సంప్రదింపుల్లో ఎలాంటి నిర్ణయం ఖరారు కాలేదని, ఫలితంగా ఒక ప్యానెల్ ఏర్పాటు చేయాలని కోరినట్లు ప్రపంచ వాణిజ్య సంస్థకు పంపిన ఓ ప్రకటనలో చైనా తెలిపింది. దీనిపై జనవరి 27న జెనీవాలో జరిగే తదుపరి డబ్ల్యూటీఓ సమావేశంలో చర్చ ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా, ఈ వివాదం భారత ప్రభుత్వం తెచ్చిన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం గురించి. ఈ పథకం భారత్‌లో తయారు చేసిన వస్తువులకు అనుకూలంగా ఉన్నాయని, చైనా ఉత్పత్తులు పోటీ పడేందుకు అడ్డంకిగా ఉన్నాయని చైనా చెబుతోంది. ఇది ప్రపంచ వాణిజ్య నియమాల ఉల్లంఘన అని, తమ కంపెనీలపై వివక్ష చూపడమేనని చైనా అంటోంది. భారత విధానాలు సబ్సిడీలు, వాణిజ్యం, పెట్టుబడి నిబంధనలపై డబ్ల్యూటీఓ ఒప్పందాలకు విరుద్ధంగా ఉన్నాయని చైనా వాదిస్తోంది. ఇది పీఎల్ఐ పథకం మాత్రమే కాదు, అధునాతన బ్యాటరీ స్టోరేజ్ పథకం, భారత్‌లో ఈవీల తయారీని ప్రోత్సహించే విధానాలతో సహా అనేక కార్యక్రమాలను చైనా పేర్కొంది.






