1,628 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

by Dishanational1 |
1,628 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది మొదటిసారి భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. కీలక బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడిని చూశాయి. ఆసియా మార్కెట్లలో ప్రతికూలతకు తోడు వడ్డీ రేట్లకు సంబంధించి ఆందోళనలు, దేశీయంగా దిగ్గజ హెచ్‌డీఎఫ్‌సీ షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. బుధవారం ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఏకంగా 8.46 శాతం కుప్పకూలాయి. ఇదే మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. పెరిగిన రుణాలు, మార్జిన్లకు సంబంధించి బ్రోకరేజీ సంస్థల అంచనాలను అందుకోకపోవడంతో బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీనికితోడు అమెరికా, యూరప్ మార్కెట్లు నష్టపోవడం, చైనా ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే దిగువన 5.2 శాతం వృద్ధిని నమోదు చేయడంతో, ఆయా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,628.01 పాయింట్లు కుప్పకూలి 71,500 వద్ద, నిఫ్టీ 460.35 పాయింట్లు క్షీణించి 21,571 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు అత్యధికంగా 4 శాతం కంటే ఎక్కువ కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, నెస్లె ఇండియా, పవర్‌గ్రిడ్ లాభాలను దక్కించుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.15 వద్ద ఉంది.


Next Story

Most Viewed