- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాటరీ షేర్ల ‘సూపర్ ఛార్జ్’: అమర రాజా, ఎక్సైడ్ షేర్లలో 19 శాతం వరకు జంప్!
అమర రాజా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేర్లు ఇవాళ ఏకంగా 19 శాతం వరకు లాభపడ్డాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్‌లో ఇవాళ బ్యాటరీ తయారీ కంపెనీల షేర్లు రాకెట్‌లా దూసుకెళ్లాయి. క్లీన్ ఎనర్జీ, ఈవీ (EV) రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాటరీ స్టాక్స్‌పై భారీగా కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ముఖ్యంగా అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ (Amara Raja) షేరు ఏకంగా 19 శాతం వరకు లాభపడగా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ (Exide) కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.
షేర్ల పెరుగుదలకు కారణం ఏంటి..?
బ్యాటరీ రంగంలో అగ్రగామిగా ఉన్న అమర రాజా ఎనర్జీ తన భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీ తన లిథియం-అయాన్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించింది. టెలికాం, డేటా సెంటర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడానికి దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 1 GWh లిథియం-అయాన్ డిప్లాయ్‌మెంట్స్‌ను పూర్తి చేసిన కంపెనీ, ఈ ఏడాది చివరికి అదనంగా మరో 1.5 GWh సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది (2027) జూన్ నాటికి ఈవీ బ్యాటరీ సెల్స్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి (Bulk Production) చేయాలని అమర రాజా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కంపెనీ ఆదాయ మార్గాలను భారీగా పెంచుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ₹9,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ‘గిగా ఫ్యాక్టరీ’ ఈ వృద్ధిలో కీలక మైలురాయి. 16 GWh సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ భారతదేశంలోనే అతిపెద్ద సెల్ తయారీ యూనిట్లలో ఒకటిగా నిలవనుంది.
ఇక అమర రాజా ప్రకటించిన దూకుడుతో పాటు, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా తన లిథియం-అయాన్ సామర్థ్యాన్ని పెంచుతుండటంతో బ్యాటరీ సెక్టార్ మొత్తం సానుకూల ధోరణిలో ఉంది. ఈవీ విప్లవానికి కీలకమైన బ్యాటరీల తయారీలో దేశీయ కంపెనీలు స్వయం సమృద్ధి సాధిస్తుండటం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.






