Car Loans: బ్యాంకుల్లో భారీగా పెరిగిన కార్ లోన్ క్యాన్సిలేషన్లు

by S Gopi |

చాలామంది బ్యాంకులను సంప్రదించి ధరలు సవరించిన తర్వాతే కొంటామని చెబుతూ, ఆర్డర్లను క్యాన్సిల్ చేయమని కోరుతున్నారు.

Car Loans: బ్యాంకుల్లో భారీగా పెరిగిన కార్ లోన్ క్యాన్సిలేషన్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత వారం వ్యవధిలో పెద్ద సంఖ్యలో కార్ లోన్‌లకు సంబంధించి క్యాన్సిలేషన్లు పెరిగాయని బ్యాంకులు వెల్లడించాయి. ఇటీవల కేంద్రం జీఎస్టీ శ్లాబులను తగ్గించిన నేపథ్యంలో పన్ను రేట్లు తగ్గనున్నాయి. దీనివల్ల అన్ని విభాగాల్లో కార్ల ధరలు దిగిరానున్నాయి. అయితే, కొత్త పన్ను రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో చాలామంది పన్నులు తగ్గాకే కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ కారణంతోనే చాలామంది బ్యాంకులను సంప్రదించి ధరలు సవరించిన తర్వాతే కొంటామని చెబుతూ, ఆర్డర్లను క్యాన్సిల్ చేయమని కోరుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పండుగ సీజన్ కోసం అనేక బ్యాంకులు వాహన, గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేశాయి. అయినప్పటికీ జీఎస్టీ రేట్ల మార్పుతో పాటు సెస్ తొలగింపు వల్ల కూడా ఎక్కువ తగ్గింపు లభిస్తుందని వినియోగదారులు ఆశిస్తున్నారు. ఈ ధోరణి కారు రుణాల విష్యంలోనే కాకుండా టూ-వీలర్ విభాగంలోనూ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా 350సీసీ సామర్థ్యం కలిగిన టూ-వీలర్లపై జీఎస్టీ తగ్గించడంతో పన్ను భారం కనీసం 9-10 శాతం లభిస్తుండటంతో అమలు తేదీ వరకు వేచి చూసి కొందామని కస్టమర్లు భావిస్తున్నారు. కాగా, ఈ నెల ప్రారంభంలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో.. 1,200సీసీ వరకు ఉన్న కార్లకు జీఎస్టీ రేటును ప్రస్తుత 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆపైన సీసీ సామర్థ్యం ఉన్న కార్లపై 40 శాతం జీఎస్టీ విధించినప్పటికీ, సెస్‌ను తొలగించడం కార్లు కొనాలనుకునే వారికి తక్కువ ధరకే వాహనాలు లభిస్తాయి. అలాగే, టూ-వీలర్ విభాగంలో 350సీసీ లోపు బైకులపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు.

Next Story