Bank Union: కాంట్రాక్టు కంటే రెగ్యులర్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి: బ్యాంకు సంఘాలు

by S Gopi |

ప్రధానంగా పెన్షన్ అప్‌డేషన్ కోసం కూడా యూనియన్లు ఒత్తిడి చేశాయి.

Bank Union: కాంట్రాక్టు కంటే రెగ్యులర్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి: బ్యాంకు సంఘాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ నేపథ్యంలో కాంట్రాక్టు నియామకాల కంటే రెగ్యులర్ ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకు సంఘాలు ప్రభుత్వాన్ని కోరినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ఉద్యోగుల సంక్షేమం, దీర్ఘకాలిక సామాజిక భద్రతకు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించే యువ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగాలు అవసరమని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. పీటీఐ ప్రకారం, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రతినిధులు ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజును కలిసి బ్యాంకు సిబ్బందిని ప్రభావితం చేసే అనేక పెండింగ్ సమస్యలను లేవనెత్తారు. వీటిలో ఐదు రోజుల బ్యాంకింగ్, వర్క్‌మ్యాన్ మరియు ఆఫీసర్ డైరెక్టర్ల నియామకాలు, క్లరికల్ సిబ్బంది, సబ్‌స్టాఫ్, భద్రతా సిబ్బంది నియామకాలను వేగవంతం చేయాల్సిన అవసరం వంటి దీర్ఘకాలిక డిమాండ్లు ఉన్నాయి. ప్రధానంగా పెన్షన్ అప్‌డేషన్ కోసం కూడా యూనియన్లు ఒత్తిడి చేశాయి. ఈ సమస్య ఎప్పటినుంచో ఉన్న క్లిష్టమైన పరిష్కారం కాని విషయంగా యూనియన్లు చెబుతున్నాయి.

మన దేశంలో యువతకు రెగ్యులర్, శాశ్వత ఉద్యోగాలు అవసరమని, కాబట్టి కార్మిక చట్టాలు కాంట్రాక్టు ఉద్యోగాలను ప్రోత్సహించడానికి బదులుగా శాశ్వత/రెగ్యులర్ నియామకాలను ప్రోత్సహించాలని యూఎఫ్‌బీయూ తన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత కార్మిక చట్టాల కింద కొన్ని విధానాలను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అటువంటి చర్యలు ఇప్పటికే ఉన్న కార్మిక హక్కులను బలహీనపరచకూడదని యూఎఫ్‌బీయూ అభిప్రాయపడింది. కాగా, 29 కార్మిక చట్టాలను ఏకీకృతం చేస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నాలుగు కార్మిక కోడ్‌లను అమలు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత, ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణలపై వీటి ప్రభావం గురించి కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.

Next Story