Bank FD: ఎఫ్‌డీ రేట్లలో కోత విధించిన బీఓబీ, కోటక్ బ్యాంక్

by S Gopi |

రూ. 3 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్లకు ఇవి వర్తిస్తాయి.

Bank FD: ఎఫ్‌డీ రేట్లలో కోత విధించిన బీఓబీ, కోటక్ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఇటీవల రెండుసార్లు కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. ఆర్‌బీఐ నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకులు సైతం డిపాజిట్లు, లోన్‌లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు కోటక్ మహీంద్రా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను తగ్గించాయి. అధికారిక వివరాల ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) తన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను మార్చింది. రూ. 3 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్లకు ఇవి వర్తిస్తాయి. సవరించిన రేట్లు సోమవారం(మే 5) నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై 4 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా, 2 ఏళ్ల ఎఫ్‌డీపై 7 శాతం, ఆరు నెలల కాలానికి 5.6 శాతం, ఏడాది కాలానికి 6.8 శాతం, రెండేళ్లకు 7 శాతం వడ్డీ అందిస్తోంది. అన్ని కాలవ్యవధులపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీని ఇస్తోంది.

స్పెషల్ ఎఫ్‌డీపైనా తగ్గింపు

స్పెషల్ ఎఫ్‌డీగా ఉన్న 444 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై కూడా బీఓబీ వడ్డీని తగ్గించింది. ఇదివరకు 7.15 శాతం వడ్డీ ఇస్తుండగా, దీన్ని 7.10 శాతానికి తగ్గించింది. సీనియర్ సిటిజన్‌లకు అధికంగా 7.70 శాతం వడ్డీని బ్యాంకు ఇస్తోంది.

మరో బ్యాంకు కోటక్ మహీంద్రా కూడా 180 రోజుల కాలపరిమితిపై ఎఫ్‌డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కాలవ్యవధులను బట్టి 7 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గించింది. కొత్త రేట్లు మే 5, 2025 నుండి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. గత నెలాఖరులో 30వ తేదీన కూడా కోటక్ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది. దీంతో వారం వ్యవధిలో బ్యాంకు రెండోసారి వడ్డీ రేట్లను సవరించింది.

Next Story