- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Real Estate: 4 ఏళ్లలో రెట్టింపు పెరిగిన స్థిరాస్తి రంగ రుణాలు
కీలకమైన క్రెడిట్ విషయంలో ఇతర ప్రధాన పరిశ్రమల కంటే ముందుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది మార్చి నాటికి భారత స్థిరాస్తి రంగంలో బ్యాంకు క్రెడిట్‌ల విలువ రూ. 35.3 లక్షల కోట్లకు చేరింది. ఇది గత నాలుగేళ్లలో దాదాపు రెట్టింపు అయిందని ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. లాభదాయకత, నిధుల వినియోగం, మార్కెట్ పనితీరు ఆధారంగా దేశంలోని టాప్-50 లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలను బట్టి ఈ అంచనా వేసినట్టు కొలియర్స్ పేర్కొంది. భారత స్థిరాస్తి రంగం కొవిడ్-19 మహమ్మారి తర్వాత ఆర్థికంగా గణనీయమైన రికవరీ సాధిస్తోంది, కీలకమైన క్రెడిట్ విషయంలో ఇతర ప్రధాన పరిశ్రమల కంటే ముందుంది. తద్వారా రియల్ ఎస్టేట్ రంగం క్రెడిట్ యాక్సెస్ పరంగా పూర్తిస్థాయిలో మెరుగుపడిందని భావించవచ్చని కొలియర్స్ ఇండియా అభిప్రాయపడింది. ఈ రంగంతో పాటు మొత్తంగా దేశంలో బ్యాంకు క్రెడిట్ గణనీయంగా పెరిగింది. అన్ని రంగాలకు కలిపి 2020-21లో రూ. 109.5 లక్షల కోట్ల క్రెడిట్‌ను బ్యాంకులు ఇవ్వగా, 2024-25 నాటికి ఇది రూ. 182.4 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో ఒక్క రియల్ ఎస్టేట్ రంగంలో బ్యాంకు క్రెడిట్‌లు రూ. 17.8 లక్షల కోట్ల నుంచి రూ. 35.3 లక్షల కోట్లకు దాదాపు రెట్టింపు అయ్యాయని ఆర్‌బీఐ డేటాను నివేదిక ప్రస్తావించింది.
దేశంలోని బ్యాంకు క్రెడిట్ విస్తరణలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు దాదాపు ఐదవ వంతు వాటా కలిగి ఉంది. ఈ రంగంపై బ్యాంకుల విశ్వాసం పెరుగుతోందని కొలియర్స్ తెలిపింది. అయితే ఇప్పటికీ భారత రియల్ ఎస్టేట్ రంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే స్థిరంగా, ఆర్థిక భరోసాను కొనసాగిస్తోందని కొలియర్స్ ఇండియా సీఈఓ బాదల్ యాగ్నిక్ అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇతర రంగాల కంటే రియల్ ఎస్టేట్ రంగంలో క్రెడిట్ రేటింగ్ అప్‌గ్రేడ్‌లు అధికంగా జరిగాయని ఆయన చెప్పారు. నివాస, వాణిజ్య, పారిశ్రామిక, గిడ్డంగులు, రిటైల్, హాస్పిటాలిటీ మొదలైన విభాగాల్లో బలమైన డిమాండ్-సరఫరా ద్వారా రియల్ ఎస్టేట్ రుణాలకు అధిక క్రెడిట్ నాణ్యత లభిస్తోందని వివరించారు. రియల్ ఎస్టేట్ రంగానికి బ్యాంక్ క్రెడిట్ అంటే ఆస్తికి సంబంధించిన కార్యకలాపాల కోసం వ్యక్తులు, వ్యాపార వర్గాలకు బ్యాంకులు అందించే రుణాలు, ఇతర ఫైనాన్సింగ్ సౌకర్యాలు. దీనర్థం.. ఆస్తి కొనుగోలు, ఇళ్ల నిర్మాణాలు, ఇంటి పునర్నిర్మాణం, భూమిని కొనడం వంటి అన్ని రకాల స్థిరాస్తి కార్యకలాపాలకు బ్యాంకు ఇచ్చే లోన్లను బ్యాంక్ క్రెడిట్‌గా పరిగణిస్తారు.






