IndiGo: క్షీణించిన ఇండిగో ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా

by S Gopi |

నవంబర్ నెలలో ఇండిగో దేశీయ మార్కెట్ వాటా 63.6 శాతానికి పడిపోయిందని డేటా పేర్కొంది

IndiGo: క్షీణించిన ఇండిగో ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు రద్దు కారణంగా ఇండిగో సంస్థ మార్కెట్ వాటా క్షీణించింది. సాంకేతిక సమస్యలతో పాటు సిబ్బందికి సంబంధించి కొత్త నిబంధనలు, షెడ్యూల్‌ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వంటి కారణాలతో ఇండిగో భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేయడం లేదా ఆలస్యంగా నడిపింది. దీంతో నవంబర్ నెలలో ఇండిగో దేశీయ మార్కెట్ వాటా 63.6 శాతానికి పడిపోయిందని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విడుదల చేసిన డేటా పేర్కొంది. అంతకుముందు అక్టోబర్‌లో ఇండిగో మార్కెట్ వాటా 65.6 శాతం ఉంది. దీంతో నెలవారీగా ఇది 2 శాతం తగ్గిందని డేటా వెల్లడించింది. ఇదే సమయంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లను నిర్వహించే ఎయిర్ ఇండియా గ్రూప్ 26.7 శాతానికి, మరో విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తమ మార్కెట్ వాటాను నవంబర్‌లో 3.7 శాతానికి పెంచుకున్నాయి. అక్టోబర్‌లో వీటి మార్కెట్ వాటా వరుసగా 25.7 శాతం, 2.6 శాతంగా ఉన్నాయి. అలాగే, కొత్త ఎయిర్‌లైన్ అకాసా ఎయిర్ దేశీయ మార్కెట్ వాటా కూడా అక్టోబర్‌లో 5.2 శాతం నుంచి గత నెలలో 4.7 శాతానికి తగ్గింది.

Next Story