IBM: దేశంలో డేటా భద్రతకు అయ్యే సగటు ఖర్చు రూ. 22 కోట్లు

by S Gopi |

గతేడాది ఇదే సమయంలో ఈ వ్యయం రూ. 19.5 కోట్లుగా ఉందని గురువారం ప్రకటనలో టెక్ దిగ్గజం ఐబీఎం తెలిపింది.

IBM: దేశంలో డేటా భద్రతకు అయ్యే సగటు ఖర్చు రూ. 22 కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డేటా ఉల్లంఘనలకు సంబంధించి కంపెనీలు చేసే ఖర్చు గణనీయంగా పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది. 2025లో సగటున ఒక్కో సంస్థ చేసే ఖర్చు 13 శాతం పెరిగి రూ. 22 కోట్లకు చేరుకుందని, గతేడాది ఇదే సమయంలో ఈ వ్యయం రూ. 19.5 కోట్లుగా ఉందని గురువారం ప్రకటనలో టెక్ దిగ్గజం ఐబీఎం తెలిపింది. అయితే, ఉల్లంఘనలు జరగకుండా డేటా భద్రత కోసం అయ్యే ఖర్చులు పెరిగినప్పటికీ, కృత్రిమ మేధ(ఏఐ) భద్రత ఇప్పటికీ బలహీనంగానే ఉందని ఐబీఎం నివేదికలో పేర్కొంది. ఫిషింగ్, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు మోసపూరిత మెసేజ్ లేదా మెయిల్ వంటి ఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయని, మొత్తం సైబర్ దాడుల్లో వీటి వాటాయే 18 శాతం ఉందని నివేదిక తెలిపింది. దీని తర్వాత థర్డ్ పార్టీ అమ్మకాలు, సరఫరా హామీ మోసాలు 17 శాతం, వ్యవస్థలపై దాడి 13 శాతంగా ఉన్నాయి. దేశంలో రీసెర్చ్ రంగాలు ఇలాంటి డేటా ఉల్లంఘనలను ఎదుర్కొనేందుకు ఎక్కువ ప్రభావితం అవుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ రంగంలోని సంస్థలు దీనికోసం అత్యధికంగా రూ. 28.9 కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా, రవాణా పరిశ్రమ రూ. 28.8 కోట్లు, పారిశ్రమ రంగం రూ. 26.4 కోట్లను ఖర్చు చేస్తున్నాయి.

మరోవైపు, ఏఐ విస్తృతంగా వాడుకలో ఉన్న నేపథ్యంలో, దాదాపు 60 శాతం సంస్థలు ఇంకా ఏఐ పాలసీని సిద్ధం చేసుకోలేదని, కొన్ని కంపెనీలు అటువంటి పాలసీని అభివృద్ధి చేస్తున్న దశలో ఉన్నాయని నివేదిక తెలిపింది. చాలా కంపెనీలు మళ్లీ అవకాశం ఉండదనే హడావుడిలో ఏఐని ఉపయోగించడంపై దృష్టి సారించాయి కానీ ఏఐ భద్రత, పాలసీని దాటవేస్తున్నాయని అభిప్రాయపడింది. వ్యాపార కార్యకలాపాల్లో ఏఐని విరివిగా వాడుతున్నప్పటికీ, భద్రత, పాలసీ విషయంలో కంపెనీలు వెనుకబడిపోతున్నాయని ఐబీఎం ఇండియా, దక్షిణాసియా టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథ్ రామస్వామి అన్నారు.

Next Story