Auto Sales: నవంబర్‌లో 20 శాతం పెరిగిన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు

by S Gopi |

జీఎస్టీ ప్రయోజనాలు, పెళ్లిళ్ల సీజన్ వల్ల కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున గిరాకీ ఏర్పడింది.

Auto Sales: నవంబర్‌లో 20 శాతం పెరిగిన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది పండుగ సీజన్‌కు తోడు కేంద్రం జీఎస్టీ 2.0 సంస్కరణల కారణంగా వాహన పరిశ్రమ భారీ అమ్మకాలను సాధించింది. అధిక డిమాండ్ మద్దతుతో ఈ ఏడాది నవంబర్‌లో రిటైల్ విక్రయాలు 2.14 శాతం పెరిగాయని పరిశ్రమ డీలర్ల సంఘం ఫాడా సోమవారం ప్రకటనలో వెల్లడించింది. జీఎస్టీ ప్రయోజనాలు, పెళ్లిళ్ల సీజన్ వల్ల కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున గిరాకీ ఏర్పడింది. ఫలితంగా సమీక్షించిన నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 19.7 శాతం, కమర్షియల్ వాహనాలు 19.94 శాతం, ట్రాక్టర్ అమ్మకాలు 56.55 శాతం, త్రీ-వీలర్ 23.67 శాతం పెరిగాయని ఫాడా పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ సానుకూలంగా ఉంది. ఇది రానున్న రోజుల్లోనూ కొనసాగవచ్చని ఫాడా అధ్యక్షుడు సీ ఎస్ విఘ్నేశ్వర్ అన్నారు. సాధారణంగా ప్రతి ఏటా పండుగ సీజన్ తర్వాత అమ్మకాలు నెమ్మదిస్తాయి. కానీ, ఈ ఏడాది అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది దసరా, దీపావళి సహా ప్రధాన పండుగలు నవంబర్‌లో కాకుండా అక్టోబర్ ఆఖరులో వచ్చాయి. ఇది కూడా వాహనాలు అమ్మకాలు ఎక్కువ రోజుల పాటు కొనసాగాయని విఘ్నేశ్వర్ పేర్కొన్నారు.

అమ్మకాలతో పాటు ప్యాసింజర్ వాహనాల విభాగంలో ఇన్వెంటరీ రోజులు 53-55 రోజుల నుంచి 44-46 రోజులకు తగ్గింది. ఫలితంగా నవంబర్‌లో 3,94,152 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో 3,29,253 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల విక్రయాలు జరిగాయి. అయితే, టూ-వీలర్ విభాగంలో మాత్రం మొత్తం అమ్మకాలు 3.10 శాతం క్షిణించి 25,46,184 యూనిట్లకు చేరాయి. ప్యాసింజర్ విభాగంలో 94,935 యూనిట్లు, ట్రాక్టర్ విభాగంలో 1,26,033 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Next Story