Auto Sales: బలహీన డిమాండ్‌తో తగ్గిన వాహన రిటైల్ అమ్మకాలు

by S Gopi |

ఫిబ్రవరిలో మొత్తం వాహనాల విక్రయాలు 7 శాతం పడిపోయాయని డీలర్స్ సంఘం ఫాడా గురువారం ప్రకటనలో వెల్లడించింది.

Auto Sales: బలహీన డిమాండ్‌తో తగ్గిన వాహన రిటైల్ అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: డిమాండ్ బలహీనపడిన కారణంగా దేశీయ వాహన పరిశ్రమలో రిటైల్ అమ్మకాలు గణనీయంగా క్షీణించాయి. ప్యాసింజర్ వాహనాలతో పాటు టూవీలర్ అమ్మకాలు కూడా దెబ్బతినడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం వాహనాల విక్రయాలు 7 శాతం పడిపోయాయని డీలర్స్ సంఘం ఫాడా గురువారం ప్రకటనలో వెల్లడించింది. ఫాడా వివరాల ప్రకారం, గత నెలలో మొత్తం 18,99,196 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇవి గతేడాది ఇదే నెలలో నమోదైన 20,46,328 యూనిట్లతో పోలిస్తే 7 శాతం తగ్గాయి. అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు క్షీణించాయని ఫాడా అధ్యక్షుడు సీ ఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. సమీక్షించిన నెలలో ప్యాసింజర్ వాహనాలు 3.03 లక్షల యూనిట్లతో 10 శాతం తగ్గాయి. టూవీలర్ విభాగంలో అమ్మకాలు 6 శాతం, కమర్షియల్ వాహనాలు 9 శాతం, ట్రాక్టర్ విక్రయాలు 14.5 శాతం క్షీణించాయి. అమ్మకాలు పడిపోవడంతో ప్రస్తుత నెలలో ఇన్వెంటరీలు భారీగా మిగిలిపోతాయని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇన్వెంటరీలు 50-52 రోజులకు పెరిగాయని తెలిపారు. తయారైన వాహనాలు అమ్ముడుపోకుండా డీలర్ల వద్ద ఉండే కాలాన్ని ఇన్వెంటరీలుగా పరిగణిస్తారు. ధరల సర్దుబాటూ, బలహీన కస్టమర్ సెంటిమెంట్, కఠినంగా మారిన ఫైనాన్స్ నిబంధనల సమస్యలను పరిష్కరించడం ద్వారా అమ్మకాలు పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి.

Next Story