- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dry Fruits: అటారీ-వాఘా మూసివేత కారణంగా డ్రై ఫ్రూట్ దిగుమతులపై ప్రభావం
ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనదేశానికి వచ్చే పలు డ్రై ఫ్రూట్స్ దిగుమతులపై గణనీయమైన ప్రభావం పడుతున్నదని అంచనా.

దిశ, బిజినెస్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దులు మూతపడ్డాయి. ఈ దాడుల్లో 26 మంది మరణించగా, వారిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య రవాణాకు కీలకమైన అటారీ-వాఘా సరిహద్దును భారత ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయించింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా భారత్‌తో పాటు భారత్ మీదుగా వెళ్లే అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. దీనివల్ల సరుకులు, ఇతర దిగుమతులకు ముఖ్యమైన ఈ మార్గంలో సరఫరా ఆగిపోయింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు జరిగే ఎగుమతులపైనా ప్రభావం పడింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనదేశానికి వచ్చే పలు డ్రై ఫ్రూట్స్ దిగుమతులపై గణనీయమైన ప్రభావం పడుతున్నదని అంచనా. అందులో బాదం, ఎండుద్రాక్ష, డ్రై ఆప్రికాట్, పిస్తాలతో పాటు ఇతర రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ కీలకమైన ఎగుమతిదారు. మొన్నటివరకు భారత అటారీ-వాఘా సరిహద్దు ద్వారానే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాణిజ్యం జరుగుతోంది. పాక్ కూడా ఈ మార్గాన్ని నిలిపేయడంతో ఆఫ్ఘాన్ నుంచి ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం ఉంటుంది.
2024-25లో ఆఫ్ఘనిస్తాన్‌కు 264.15 మిలియన్ డాలర్ల(రూ. 2,246 కోట్ల) విలువైన ఎగ్మతులు జరిగాయి. దిగుమతుల విలువ 591.49 మిలియన్ డాలర్లు(రూ. 5,030 కోట్ల)గా ఉన్నాయి. ఇందులో డ్రై ఫ్రూట్స్ దిగుమతుల విలువే రూ. 3 వేల కోట్లకు పైగా ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రోడ్డు మార్గంలో దిగుమతి చేసుకుంటున్న ప్రధాన ఉత్పత్తులలో ఎండిన అంజీర పండ్లు, ఇంగువ, కుంకుమపువ్వు, ఎండిన ఆప్రికాట్, పిస్తాపప్పులు, ఎండుద్రాక్షలు ఉన్నాయి. అటారీ-వాఘా సరిహద్దు మూసేయడం వల్ల ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ల నుంచి డ్రై ఫ్రూట్స్ దిగుమతులు ప్రభావితం అవుతాయని ఢిల్లీకి చెందిన ఓ దిగుమతుల వ్యాపారి చెప్పారు. కొన్ని సరుకులు రవాణా మార్గంలో ఉన్నందున ఇప్పటికిప్పుడు ప్రభావం ఉండకపోవచ్చు. పది రోజుల తర్వాత ప్రభావం కనిపిస్తుందని, ఫలితంగా దేశ రాజధానిలో డ్రై ఫ్రూట్స్ ధరలు 20 శాతం మేర పెరగవచ్చని ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ బాత్రా పేర్కొన్నారు. అయితే, ఆఫ్ఘాన్ ప్రత్యామ్నాయమేనని, యూఏఈ, ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి దిగుమతులు జరుగుతాయని ఆయన వెల్లడించారు.






