New Financial Year: రేపటి నుంచి జరగబోయే ఆర్థిక మార్పులివే

by S Gopi |

ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్-2025 అమల్లోకి రానుంది.

New Financial Year: రేపటి నుంచి జరగబోయే ఆర్థిక మార్పులివే
X

దిశ, బిజినెస్ బ్యూరో: నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకానుంది. ముగియనున్న 2024-25లో కంటే కొత్త 2025-26 ఆర్థిక సంవత్సరంలో అనేక ఆర్థిక, పన్ను సంబంధిత నిబంధనలు మారనున్నాయి. ఆదాయపు పన్ను మొదలుకొని అనేక డిజిటల్ లావాదేవీలు, బ్యాంకు పనుల్లో మార్పులు జరగనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్-2025 అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి మన దైనందిన ఆర్థిక పనుల్లో మారబోయే విషయాల గురించి తెలుసుకుందాం..!

రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు

ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం సవరించిన శ్లాబ్‌లతో అమలవుతుంది. రూ. 12 లక్షల వరకు ఆదాయం వారికి ఎలాంటి పన్ను ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకుంటే రూ. 12,75,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఇన్‌యాక్టివ్ యూపీఐ నంబర్‌ల డీయాక్టివేట్

ఎక్కువ కాలం ఉపయోగించకుండా మొబైల్ నంబర్‌లకు లింక్ చేసిన యూపీఐ అకౌంట్లను తొలగించడాన్ని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి బ్యాంకులు, పేమెంట్ సేవల కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో అనధికారిక పనులు, మోసాలను నిలువరించేందుకు ఆయా నంబర్లను డీయాక్టివేట్ చేయాలని స్పష్టం చేసింది. దీంతో ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్లను వాడుతున్న వినియోగదారులు గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌పే మొదలైన ఆన్‌లైన్ చెల్లింపుల యాప్‌లను ఉపయోగించలేరు.

క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లలో మార్పులు

కొంతమంది క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం రివార్డ్ పాయింట్ల నియమాలు మారనున్నాయి. ఎస్‌బీఐ సింప్లీక్లిక్, ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ హోల్డర్లు కొత్త రివార్డ్ స్ట్రక్చర్ కిందకు రానున్నారు. ఇది కాకుండా, ఎయిర్ ఇండియా, విస్తారా విలీనం కారణంగా యాక్సిస్ బ్యాంక్ విస్తారా క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను కూడా సవరించనుంది.

ఏకీకృత పెన్షన్ పథకం

పాత పెన్షన్ విధానం స్థానంలో పదవీ విరమణకు ముందు 12 నెలల్లో బేసిక్ జీతంలో 50 శాతాన్ని పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పించే ‘ఏకీకృత పెన్షన్ పథకం’ (యూపీఎస్‌) అమల్లోకి వస్తుంది. ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

జీఎస్టీ నిబంధనలు

జీఎస్టీ పోర్టల్‌లో మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేయనున్నారు. ఇది కాకుండా, 180 రోజుల కంటే పాత పత్రాలను ఉపయోగించి మాత్రమే ఇ-వే బిల్లులను రూపొందించే నిబంధన ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుంది.

ప్రీమియం హోటల్ బసలపై అధిక జీఎస్టీ

ఒక రోజుకు రూ. 7,500 కంటే ఎక్కువ వసూలు చేసే హోటల్‌లను ‘స్పెసిఫైడ్ ప్రెమిసెస్’గా పరిగణించనున్నారు. ఈ హోటళ్లలోని రెస్టారెంట్ సేవలకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే, దీనికి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాలు లభిస్తాయి.

కఠినమైన కనీస బ్యాలెన్స్ నిబంధనలు

ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రధాన బ్యాంకులు కనీస బ్యాలెన్స్ విషయంలో కొత్త నిబంధనలను అప్‌డేట్ చేశాయి. ఏప్రిల్ 1 నుంచి అర్బన్, సెమీ-అర్బన్, రూరల్ ఏరియాను బట్టి మినిమమ్ బ్యాలెన్స్ మొత్తం వేర్వేరుగా ఉండనుంది. ఆ మొత్తం అకౌంట్‌లో లేకపోతే జరిమానాలు తప్పవు.

బ్యాంక్ పేరు అర్బన్ సెమీ-అర్బన్ రూరల్

ఎస్‌బీఐ రూ. 3,000 రూ. 2,000 రూ. 1,000

పీఎన్‌బీ రూ. 3,500 రూ. 2,500 రూ.1,500

బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 4,000 రూ. 3,000 రూ. 2,000


పాన్-ఆధార్ లింక్ లేకపోతే డివిడెండ్ లేదు

ఈ ఏడాది మార్చి 31 నాటికి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని పక్షంలో పెట్టుబడిదారులు డివిడెండ్ చెల్లింపులు పొందలేరు. ఫలితంగా వారు అధిక టీడీఎస్‌ను కట్టాల్సి రావొచ్చు.

ఎంఎఫ్, డీమ్యాట్ ఖాతాలకు కేవైసీ తప్పనిసరి

ఏప్రిల్ 1 నుంచి, మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ ఖాతాలకు నామినీ వివరాల రీ-వెరిఫికేషన్ తప్పనిసరి.

రూ. 50,000 పైన ఉన్న చెక్కులకు పాజిటివ్ పే సిస్టమ్

మోసాలను అరికట్టడానికి.. కొత్త పాజిటివ్ పే సిస్టమ్ కింద రూ. 50,000 కంటే ఎక్కువ చెల్లింపులను క్లియర్ చేయడానికి ముందు బ్యాంకులు చెక్ వివరాలను ఎలక్ట్రానిక్‌ విధానంలో ధృవీకరిస్తాయి.

హోమ్ లోన్ పరిమితులు సవరణ

ఇళ్ల కొనుగోలుదారులు ఇప్పుడు ప్రాధాన్య రంగ రుణ పథకం కింద మెట్రో నగరాల్లో రూ. 50 లక్షలు, మధ్య స్థాయి పట్టణాల్లో రూ. 45 లక్షలు, చిన్న నగరాల్లో రూ. 35 లక్షల వరకు రుణాలు పొందవచ్చు.

టీసీఎస్ థ్రెషోల్డ్ సవరణ

విదేశీ ప్రయాణం, పెట్టుబడులు, అధిక-విలువ లావాదేవీలపై టీసీఎస్ పరిమితిని సంవత్సరానికి రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారు.

Next Story