Apple: ఏడాది ఆఖర్లో యాపిల్ కొత్త రిటైల్ స్టోర్ల ప్రారంభం

by S Gopi |

ఇప్పటికే కంపెనీకి దేశంలో రెండు రిటైల్ స్టోర్లు ఉండగా, కొత్తగా మరో నాలుగు ప్రారంభించనున్నారు

Apple: ఏడాది ఆఖర్లో యాపిల్ కొత్త రిటైల్ స్టోర్ల ప్రారంభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఆఖరు నాటికి దేశంలో రెండో దశ విస్తరణలో భాగంగా యాపిల్ కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించనున్నట్టు స్పష్టం చేసింది. కొత్త స్టోర్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కస్టమర్లతో కనెక్ట్ అవ్వడం మరింత సులభమవుతుందని యాపిల్ భావిస్తోంది. స్టోర్ల విస్తరణ ద్వారా ఐఫోన్‌లు, యాపిల్ వాచ్, ఐప్యాడ్ సహా అన్ని యాపిల్ పరకారాలను కస్టమర్లు కొనేందుకు ఎక్కువ ఆప్షన్లు కల్పించినట్టు అవుతుందని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే కంపెనీకి దేశంలో రెండు రిటైల్ స్టోర్లు ఉండగా, కొత్తగా మరో నాలుగు ప్రారంభించనున్నారు. తాజాగా ఈ ఏడాది రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. భారత్ సహా అన్ని దేశాల్లో కంపెనీ రికార్డు లాభాలను సాధించింది. ఈ త్రైమాసికంలో యూఏఈలో కొత్త రిటైల్ స్టోర్, సౌదీ అరేబియాలలో ఆన్‌లైన్ స్టోర్ అందుబాటులోకి తెచ్చాం. ఈ ఏడాదిలో భారత్‌లో కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని టిమ్ కుక్ చెప్పారు. అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం పూణె, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కొత్త యాపిల్ రిటైల్ స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొత్త స్టోర్ల కోసం నియామకాలను కూడా కంపెనీ ప్రారంభించింది. ఇటీవల పరిణామాలను గమనిస్తే.. భారత మార్కెట్ యాపిల్‌కు అత్యంత కీలకంగా మారింది. రిటైల్ స్టోర్లతో పాటు తయారీ సామర్థ్యాలను కూడా కంపెనీ పెంచుతోంది.

Next Story