Apple: ఆన్‌లైన్ కొనుగోలుదారుల కోసం వీడియో కాల్ సపోర్ట్‌ ప్రారంభించిన యాపిల్

by S Gopi |

సురక్షితమైన, వన్-వే వీడియో కాల్ ద్వారా కస్టమర్లు యాపిల్ స్టోర్ టీమ్‌తో మాట్లాడి సేవలు పొందేందుకు వీలు కల్పిస్తుంది.

Apple: ఆన్‌లైన్ కొనుగోలుదారుల కోసం వీడియో కాల్ సపోర్ట్‌ ప్రారంభించిన యాపిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ యాపిల్ కస్టమర్ల కోసం ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తన ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేసే వారికోసం యాపిల్ స్టోర్ రిటైలర్లకు వీడియో కాల్ చేసే వీలు కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆన్‌లైన్ స్టోర్ యాప్ ప్రారంభించిన కంపెనీ, అమెరికా తర్వాత ఈ ఫీచర్‌ను పొందిన రెండో దేశంగా భారత్ నిలిచింది. ముఖ్యంగా సురక్షితమైన, వన్-వే వీడియో కాల్ ద్వారా కస్టమర్లు యాపిల్ స్టోర్ టీమ్‌తో మాట్లాడి అవసరమైన సేవలు పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. దీని ద్వారా కొత్త యాపిల్ ఉత్పత్తులను, కొత్త ఫీచర్ల గురించి కనుక్కొనే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్, ఫైనాన్సింగ్ ఆప్షన్స్, ఇంకా ఇతర వివరాలను ఇంటి నుంచే తెలుసుకోవచ్చు. భారత్ శక్తివంతమైన, డైనమిక్ మార్కెట్. ఇక్కడ వీడియో కాల్ ద్వారా యాపిల్ స్పెషలిట్‌తో మాట్లాడి షాపింగ్ చేయడం ద్వారా కస్టమర్లు కంపెనీ సేవల పట్ల మరింత విశ్వాసాన్ని పొందుతారని యాపిల్ రిటైల్ ఆన్‌లైన్ హెడ్ కారెన్ రాస్ముసేన్ చెప్పారు. మెట్రో లేదా చిన్న పట్టణాల్లోని వారైనా సరే ఈ సదుపాయాన్ని ఉపయోగించి వారికి కావాల్సిన ఉత్పత్తులు, సేవలను కొనవచ్చని ఆయన తెలిపారు. ఈ ఫీచర్ సోమావరం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

Next Story