Apple: భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ల తయారీ

by S Gopi |

భారత్‌లో ఉత్పత్తి అయిన దాంట్లో మెజారిటీ భాగం దక్షిణాది ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ తయారీ కేంద్రంలో అసెంబుల్ చేశారు.

Apple: భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ల తయారీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తన ఐఫోన్‌ల తయారీని వేగవంతం చేస్తోంది. కొవిడ్-19 మహమ్మారి పరిణామాల కారణంగా చైనాలో తయారీ నుంచి దూరం జరగాలని భావిస్తున్న యాపిల్‌కు తాజా వాణిజ్య యుద్ధ పరిస్థితులు మరింత ఊతమిచ్చాయి. తాజాగా యాపిల్ 22 బిలియన్ డాలర్ల(రూ. 1.89 లక్షల కోట్ల) విలువైన ఐఫోన్‌ల ఉత్పత్తిని చేపట్టినట్టు తెలుస్తోంది. దీంతో కంపెనీ తన గ్లోబల్ ఐఫోన్ ఉత్పత్తిలో 20 శాతం ఇప్పుడు భారత్ నుంచి వస్తుందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. భారత్‌లో ఉత్పత్తి అయిన దాంట్లో మెజారిటీ భాగం దక్షిణాదిలో ఉన్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ తయారీ కేంద్రంలో అసెంబుల్ చేశారు. మరికొంత భాగం టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎలక్ట్రానిక్స్ తయారీ విభాగంలోనూ జరిగాయని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఎగుమతుల పరంగా భారత్‌లో యాపిల్ కార్యకలాపాలు విజయవంతమయ్యాయి. ఇటీవల మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. ప్రధానంగా ఇందులో ఎక్కువ భాగం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకం నిర్ణయం కారణంగా పెరిగింది. ఈ పరిణామంతో యాపిల్ సంస్థ భారత్ మార్కెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం భారత మార్కెట్లో యాపిల్‌కు స్థానికంగా పెరుగుతున్న అమ్మకాలు కూడా ఉత్సాహాన్నిస్తున్నాయి. దేశీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో దాదాపు 8 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకున్న యాపిల్, 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8 బిలియన్ డాలర్ల(రూ. 68.87 వేల కోట్ల) విలువైన అమ్మకాలను సాధించింది.

Next Story