Apple: బెంగళూరులో రూ. 1,333 కోట్లకు ఆఫీస్ లీజుకు తీసుకున్న యాపిల్

by S Gopi |

దాదాపు 1.21 లక్షల చదరపు అడుగులు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నాల్గవ అంతస్తు వరకు లీజుకు తీసుకున్న కంపెనీ, దానికోసం నెలకు రూ. 2.84 కోట్ల అద్దె చెల్లించనున్నట్టు తెలుస్తోంది.

Apple: బెంగళూరులో రూ. 1,333 కోట్లకు ఆఫీస్ లీజుకు తీసుకున్న యాపిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్లో మరింత దూకుడుగా విస్తరణ చేపడుతోంది. ఇప్పటికే ఐఫోన్లు సహా ఇతర ఉత్పత్తుల తయారీని పెంచిన కంపెనీ, తాజాగా బెంగళూరులో కొత్త కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఎంబసీ జెనిత్‌లో 10 ఏళ్ల కాలానికి ఆఫీస్ స్పేస్ కోసం లీజుపై యాపిల్ సంతకం చేసింది. దాదాపు 1.21 లక్షల చదరపు అడుగులు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నాల్గవ అంతస్తు వరకు లీజుకు తీసుకున్న కంపెనీ, దానికోసం నెలకు రూ. 2.84 కోట్ల అద్దె చెల్లించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ భవనంలో ఉన్న స్థలంతో కలిపి యాపిల్ మొత్తం 3.89 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌స్టాక్ యాక్సెస్ చేసిన పత్రాల ప్రకారం, చదరపు అడుగుకు అద్దె నెలకు రూ. 235గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ స్థలాన్ని ఎంఏసీ చార్లెస్ (ఇండియా) లిమిటెడ్ లీజుకు ఇచ్చింది. ఇది గతేడాది సెప్టెంబర్ 25 నుంచే ప్రారంభమైంది. యాపిల్ ఇప్పటికే రూ. 14.24 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది. అంతేకాకుండా 123 పార్కింగ్ స్థలాల కోసం నెలకు రూ. 11.07 లక్షలు కూడా చెల్లిస్తుంది. 2026, ఏప్రిల్ 3 నుంచి అద్దె ప్రతి సంవత్సరం 4.5 శాతం పెరుగుతుంది. అంటే పదేళ్ల లీజు కోసం యాపిల్ మొత్తం రూ. 1,333 కోట్లను చెల్లిస్తుందని ప్రాప్‌స్టాక్ పేర్కొంది.

Next Story