Zomato: జొమాటోలో మరో బాదుడు.. ఇకపై దూరాన్ని బట్టి ఛార్జీలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-23 07:54:46  IST  )

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కస్టమర్లకు మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది.

Zomato: జొమాటోలో మరో బాదుడు.. ఇకపై దూరాన్ని బట్టి ఛార్జీలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) కస్టమర్లకు మరో షాకిచ్చింది. లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు (Long distance service fee) పేరుతో ఇకపై రెస్టారెంట్లు/హోటళ్ల దూరాన్ని బట్టి డెలివరీ ఛార్జీలను అదనంగా వసూలు చేయనుంది. ఈ ఫీజు 4 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసినప్పుడు వర్తిస్తుంది. ఇక ఆర్డర్ దూరం 4 నుంచి 6 కిలోమీటర్ల మధ్య ఉండి ఆర్డర్‌ విలువ రూ.150 దాటితే కస్టమర్లకు రూ.15 వసూలు చేయనున్నారు. 6 కిలోమీటర్ల పరిధి దాటితే ఆర్డర్‌ విలువతో సంబంధం లేకుండా నగరాన్ని బట్టి సర్వీస్‌ ఛార్జి రూ.25 నుంచి రూ.35 వరకు వసూలు చేయనుంది.

కాగా, కరోనా కంటే ముందు జొమాటో 4 నుంచి 5 కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న దూరానికి ఎలాంటి ఛార్జీలు విధించేది కాదు. మహమ్మారి తర్వాత అనేక రెస్టారెంట్లు మూతపడటంతో ఆ డెలివరీ పరిధిని 15 కిలోమీటర్ల వరకు పెంచింది. తర్వాత క్రమంగా తగ్గించుకుంటూ డెలివరీ ఫీజును మొదలుపెట్టింది. ఇప్పుడు దూరాన్ని బట్టి ఫీజు వసూలుచేయాలని నిర్ణయించింది. అయితే, డిస్టెన్స్‌ ఛార్జీ, సర్వీసు ఛార్జీ ఆర్డర్‌ విలువకు 30 శాతం మించకుండా చూసుకోవాలని రెస్టారెంట్‌లకు జొమాటో సూచించింది. అయితే కొన్ని రెస్టారెంట్లు తమ మొత్తం కమీషన్ రుసుములు వాస్తవానికి 45 శాతం వరకు ఉండవచ్చని చెబుతున్నాయి. కాగా, జొమాటో నష్టాలను తగ్గించుకొనే ప్రయత్నంలో భాగంగా పలు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌ ఫీజును వసూలు చేస్తున్న ఈ కంపెనీ తాజాగా.. జొమాటో గోల్డ్‌ చందాదారులకు రెయిన్‌ సర్‌ఛార్జీ మినహాయింపును తొలగించింది.

Next Story