Angel One: 90 శాతం పడిపోయిన ఏంజెల్ వన్ షేరు..? అసలు కారణం ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-26 07:02:14  IST  )

స్టాక్ మార్కె‌ట్‌లో ‘ఏంజిల్ వన్’ షేర్లు అనూహ్యంగా పడిపోతున్నట్లుగా మొబైల్ యాప్‌లో చూపించడం ఇన్వెస్టర్లను కలవరానికి గురి చేస్తోంది.

Angel One: 90 శాతం పడిపోయిన ఏంజెల్ వన్ షేరు..? అసలు కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ మార్కెట్ యాప్‌లలో ఇవాళ ఏంజెల్ వన్ (Angel One) షేరు ధర దాదాపు 90 శాతం తగ్గినట్లుగా కనిపిస్తోంది. అయితే, ఇది కంపెనీ నష్టపోవడం వల్ల జరిగింది కాదని, ముందుగా ప్రకటించిన స్టాక్ స్ప్లిట్ (Stock Split) ప్రక్రియ అమల్లోకి రావడం వల్ల జరిగిన సర్దుబాటేనని తెలుస్తోంది. అయితే, ఏంజెల్ వన్ బోర్డు 1:10 నిష్పత్తిలో స్టాక్ స్ప్లిట్‌ను ప్రకటించింది. అంటే, రూ.10 ఫేస్ వాల్యూ కలిగిన ఒక పాత షేరు, రూ.1 ఫేస్ వాల్యూ కలిగిన 10 కొత్త షేర్లుగా విభజించబడింది. ఫిబ్రవరి 26ను ఈ విభజనకు రికార్డు తేదీగా నిర్ణయించారు. అయితే, ఇవాళ షేర్లు ఎక్స్-స్ప్లిట్ (Ex-split) ధరకు ట్రేడ్ అవుతున్నాయి.

కాగా, బుధవారం ఏంజెల్ వన్ షేరు ధర రూ.2,491 వద్ద ముగిసింది. 1:10 విభజన తర్వాత, నేడు మార్కెట్‌లో ఈ షేరు సుమారు రూ.250 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అందుకే ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో ధర 90 శాతం తగ్గినట్లు కనిపిస్తోంది. ఇన్వేస్టర్ల వద్ద వద్ద ఒక షేరు ఉంటే, దానికి అదనంగా 9 షేర్లు వారి డీమాట్ ఖాతాలోకి వస్తాయి. మొత్తం షేర్ల సంఖ్య 10 అవుతుంది. మీ పెట్టుబడి విలువలో ఎలాంటి మార్పు ఉండబోదని స్టాక్ నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా షేరు ధర భారీగా పెరిగినప్పుడు, చిన్న (Retail) ఇన్వెస్టర్లకు అది అందుబాటులో ఉండదు. స్టాక్ స్ప్లిట్ చేయడం ద్వారా షేరు ధర తగ్గి, మార్కెట్‌లో లిక్విడిటీ పెరుగుతుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు తక్కువ ధరలో షేర్లను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. మరోవైపు ‘ఏంజెల్ వన్’ ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో మోతీలాల్ ఓస్వాల్ వంటి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుకు ‘Buy’ రేటింగ్ ఇచ్చాయి. విభజన తర్వాత కూడా ఈ స్టాక్ భవిష్యత్తులో మంచి వృద్ధిని సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story