Exporters: డబుల్ టారిఫ్ దెబ్బకు భారత దిగుమతులు నిలిపేసిన అమెరికా రిటైల్ దిగ్గజాలు

by S Gopi |

తదుపరి నోటీసులు ఇచ్చేవరకు టెక్స్‌టైల్స్, ఫ్యాషన్ ఉత్పత్తులను నిలిపివేయాలని కోరుతూ ఎగుమతిదారులకు కంపెనీలు మెయిల్స్ పంపాయి

Exporters: డబుల్ టారిఫ్ దెబ్బకు భారత దిగుమతులు నిలిపేసిన అమెరికా రిటైల్ దిగ్గజాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై డబుల్ టారిఫ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ దేశ వ్యాపారుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా అదనపు సుంకం భారం ఎగుమతిదారులపైనా లేక అమెరికాలో దిగుమతి చేసుకునే కంపెనీలపైనా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. ఫలితంగా దీనిపై స్పష్టత వచ్చే వరకు వాల్‌మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ వంటి అనేక ప్రధాన అమెరికన్ రిటైలర్ దిగ్గజాలు భారత ఆర్డర్లను నిలిపేసినట్టు సమాచారం. ప్రస్తుతానికి మనదేశం నుంచి ఎలాంటి స్టాక్ దిగుమతులనైనా సరే వద్దని చెప్పినట్టు ఎన్డీటీవీ ప్రాఫిట్ తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా తదుపరి నోటీసులు ఇచ్చేవరకు టెక్స్‌టైల్స్, ఫ్యాషన్ ఉత్పత్తులను నిలిపివేయాలని కోరుతూ భారతీయ ఎగుమతిదారులకు అమెరికా కంపెనీలు ఈ-మెయిల్స్ పంపాయి. అమెరికాలో ఈ ఉత్పత్తులను కొనేవారు పెరిగిన ఖర్చుల భారాన్ని భరించేందుకు సిద్ధంగా లేరు. బదులుగా ఆ మొత్తం ఆర్థిక భారాన్ని భరించాలని భారతీయ ఎగుమతిదారులపైనే ఒత్తిడి తెస్తున్నాయి.

కొత్త టారిఫ్ కారణంగా ఖర్చులు 30 నుంచి 35 శాతం పెరుగుతాయని అంచనా. దీని ఫలితంగా అమెరికాకు వెళ్లే ఆర్డర్‌లు 40 నుంచి 50 శాతం తగ్గుతాయి. దీని వల్ల 4-5 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 35,000-44,000 కోట్ల) నష్టాలు సంభవించవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వెల్‌స్పన్ లివింగ్, గోకల్‌డాస్ ఎక్స్‌పోర్ట్స్, ఇండో కౌంట్, ట్రైడెంట్ వంటి ప్రధాన ఎగుమతిదారులు తమ అమ్మకాలలో 40-70 శాతం అమెరికా మార్కెట్‌కు పంపిస్తున్నాయి. టారిఫ్ కారణంగా ఇప్పుడు బంగ్లాదేశ్, వియత్నాం వంటి పోటీ దేశాలు ఆ మేరకు మార్కెట్‌ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Next Story