Amazon Pay Insurance: పూర్తిగా డిజిటల్‌గా కార్, బైక్ ఇన్సూరెన్స్‌

by S Gopi |

వాహనదారులు అమెజాన్ పే ప్లాట్‌ఫామ్‌లో కేవలం నిమిషాల వ్యవధిలో బీమా పాలసీలను తమకు నచ్చిన ప్రయోజనాలతో కొనుగోలు చేయవచ్చని అమెజాన్ తెలిపింది.

Amazon Pay Insurance: పూర్తిగా డిజిటల్‌గా కార్, బైక్ ఇన్సూరెన్స్‌
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌కు చెందిన ఫిన్‌టెక్ విభాగం అమెజాన్‌ పే ఇన్సూరెన్స్ సదుపాయాన్ని వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా వాహన బీమా పోర్ట్‌ఫోలియోను ఎక్కువమందికి చేరేలా పూర్తిగా డిజిటల్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా అందించడంతో పాటు నగదు రహిత క్లెయిమ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. దీంతో వినియోగదారులు నేరుగా అమెజాన్ యాప్ నుంచే కారు, టూ-వీలర్ బీమాను కొనుగోలు చేయవచ్చు. వాహనదారులు అమెజాన్ పే ప్లాట్‌ఫామ్‌లో కేవలం నిమిషాల వ్యవధిలో బీమా పాలసీలను తమకు నచ్చిన ప్రయోజనాలతో కొనుగోలు చేయవచ్చని అమెజాన్ తెలిపింది. దీనికోసం కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గొ, అకో, ఐసీఐసీఐ లాంబార్డ్ లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల వినియోగదారులు తమకు నచ్చిన విధంగా ఎక్కువ పాలసీల నుంచి ఎంచుకునే సదుపాయాన్ని కల్పిస్తూ, 9,000కి పైగా గ్యారేజీల వద్ద నగదు రహిత క్లెయిమ్ నెట్‌వర్క్‌ను కూడా అమెజాన్ పే అందిస్తోంది.

నిమిషాల్లో డిజిటల్‌గా వాహన బీమా కొనుగోలు

అమెజాన్ యాప్ నుంచి వినియోగదారులు తమ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి, కవరేజ్ ఆప్షన్‌లను ఎంచుకుని, డిజిటల్‌గా చెల్లింపు పూర్తి చేయడం ద్వారా వాహన బీమాను కొనుగోలు చేయవచ్చు. పూర్తీ డిజిటల్‌గా జరిగే ఈ ప్రక్రియ సేల్స్ కాల్స్, ఎక్కువ పేపర్‌వర్క్ లాంటి అనేక సాంప్రదాయ ఇబ్బందులను తొలగిస్తుంది. ఇదే సమయంలో తక్షణ డిజిటల్ పాలసీ జారీ అవుతుంది. టూ-వీలర్ పాలసీల విషయంలో సాధారణంగా వాహనాన్ని భౌతికంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు, ఇది ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. ఇన్సూరెన్స్ కొనుగోలు చేసిన వెంటనే, పాలసీ కస్టమర్‌కు చెందిన అమెజాన్ ఆర్డర్స్ పేజీలో కనిపిస్తుంది. దీనివల్ల అవసరమైనప్పుడు పాలసీ వివరాలు, డాక్యుమెంట్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

చిన్న నగరాలపైనా దృష్టి

ప్రధానంగా డిజిటల్ ప్రక్రియ ద్వారా బీమా ఉత్పత్తుల లభ్యత టైర్-2, టైర్-3 లాంటి పట్టణాల్లో కూడా లభిస్తుందని అమెజాన్ చెబుతోంది. మెట్రో నగరాల్లోని కస్టమర్లకు లభించిన మాదిరిగానే చిన్న పట్టణాల్లో ఉండేవారికి డిజిటల్ కొనుగోలు, క్లెయిమ్ సపోర్ట్ అందుతుందని అమెజాన్ పే ఇండియా సీఈఓ వికాస్ బన్సల్ పేర్కొన్నారు. దేశంలో రిజిస్టర్ అయిన టూవీలర్ వాహనాల్లో 70 శాతానికి పైగా వాహనాలకు బీమా లేదు, అందుకే టైర్-2, టైర్-3 నగరాల్లో బీమా వ్యాప్తిని పెంచడంపై దృష్టి సారించామన్నారు.

అమెజాన్ పే వాహన బీమా ఆఫర్‌ ప్రయోజనాలు

* వివిధ బీమా సంస్థల నుంచి పోటీ ధరల్లో ప్రీమియం సౌకర్యం

* కొనుగోలుకు ముందు వివిధ బీమా సంస్థల ప్లాన్‌లను పోల్చి చూడవచ్చు.

* పూర్తిగా డిజిటల్ ఆన్‌బోర్డింగ్

* దేశవ్యాప్తంగా 9,000కు పైగా గ్యారేజీలలో నగదు రహిత క్లెయిమ్‌లు

* తక్షణ పాలసీ జారీ, డిజిటల్ యాక్సెస్

* అమెజాన్ పే ద్వారా అదనపు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు

* ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారు బీమా సంస్థలు అందించే ప్రత్యేక ప్రీమియం డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు.

Next Story