- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amazon Pay: ఖాతా లేకుండా ఎఫ్‌డీలో మదుపు ఎలా చేయాలంటే..!
ముఖ్యంగా అధిక వడ్డీ రేట్లతో ఈ మదుపు సదుపాయం తీసుకురావడం గమనార్హం.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల చాలామందిలో ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. ముఖ్యంగా దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిన తర్వాత మదుపుపై అవగాహన, అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కువ రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం ఆశించే వారు ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)ను ఎంచుకుంటున్నారు. ఇందులో సీనియర్ సిటిజన్లే కాకుండా కొత్త జనరేషన్ కూడా ఆసక్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్ చెల్లింపుల కంపెనీ అమెజాన్ పే తన సేవల్లో కొత్త తరహా ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై అమెజాన్ పే నుంచే కస్టమర్లు నేరుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ)లో మదుపు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా అధిక వడ్డీ రేట్లతో ఈ మదుపు సదుపాయం తీసుకురావడం గమనార్హం.
ఇప్పటికే యూపీఐ, బిల్ పేమెంట్స్ వంటి సర్వీసులు అందిస్తోన్న అమెజాన్ పే కొత్తగా ఎఫ్‌డీ సదుపాయాన్ని ప్రారంభించింది. దీనికోసం పలు ఆర్థిక సంస్థలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా అమెజాన్ కస్టమర్లు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్‌బీలు), బ్యాంకులకు చెందిన ఎఫ్‌డీలలో పెట్టుబడి పెట్టవచ్చు.
రూ.1,000 నుంచి మొదలు
ఈ సదుపాయం ప్రధానంగా, ఆయా సంస్థల్లో ప్రత్యేకంగా పొదుపు ఖాతా తెరవకుండానే ఇన్వెస్ట్ చేసే వీలు కల్పిస్తుంది. సులభంగా అమెజాన్ పే యాప్ నుంచే ఎఫ్‌డీ చేసుకోవచ్చు. రూ. 1,000 నుంచి ఎంత మొత్తమైనా ఎఫ్‌డీ చేసుకోవచ్చు. వాటిపై కాలపరిమితిని బట్టి 8 శాతం అధిక వడ్డీ లభిస్తుందని అమెజాన్ తెలిపింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా, శ్రీరామ్ ఫైనాన్స్ మహిళలకు అదనంగా 0.5 శాతం ఎక్కువ వడ్డీ రాబడి అందిస్తోంది. అదనపు పత్రాలు లేకుండా డిజిటల్ పద్దతిలో ఈ ఎఫ్‌డీలో మదుపు సదుపాయం కల్పిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.
బీమా రక్షణ
ఈ ఎఫ్‌డీలపై ప్రతి డిపాజిటర్‌కు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) కింద అందించే రూ. 5 లక్షల బీమా హామీ లభిస్తుందని అమెజాన్ పే పేర్కొంది. ఇది వినియోగదారులకు నియంత్రణ రక్షణను అందిస్తుందని అమెజాన్ పే తెలిపింది.
అమెజాన్ ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్..
* అమెజాన్ పేలో ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవల కోసం వినియోగదారులు అమెజాన్ యాప్‌లో అమెజాన్ పే విభాగాన్ని క్లిక్ చేయాలి.
* అక్కడ ఫిక్స్‌డ్ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంటుందని, దాన్ని యాక్సెస్ చేయాలి.
* ముందుకెళ్లడానికి నిబంధనలు, షరతులను పూర్తి చేయాలి.
* నచ్చిన భాగస్వామ్య బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీని ఎంచుకుని, ఎంత కాలానికి డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి.
* పెట్టుబడి మొత్తాన్ని ఎంటర్ చేసి, వడ్డీ రేటు, నిబంధనలను సరి చూసుకోవచ్చు.
* ఈ స్కీమ్ కోసం ఎటువంటి డాక్యుమెంట్ అవసరం ఉండదు, సులభంగా డిజిటల్ విధానంల్ ప్రాసెస్ పూర్తిచేయవచ్చు.
ఏ సంస్థలో ఎంత వడ్డీ ఉందంటే..
* శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్టంగా 7.5 శాతం వడ్డీని ఎఫ్‌డీలపై అందిస్తోంది. ఈ వడ్డీ రేటు 21 నెలలు 1 రోజు నుంచి 22 నెలల కాలపరిమితికి వర్తిస్తుంది. అదే విధంగా, స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 18 నెలలు 1 రోజు నుంచి 18 నెలలు 2 రోజులు గల ఎఫ్‌డీలపై 7.75 శాతం వడ్డీను ఇస్తోంది.
* సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అత్యధికంగా 8 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ రేటు 5 సంవత్సరాల కాలపరిమితి గల ఎఫ్‌డీలకు వర్తిస్తుంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 నుంచి 3 సంవత్సరాల కాలానికి ఎఫ్‌డీలపై 7.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
* సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా గరిష్టంగా 8 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే, ఈ రేటు వర్తించే ఖచ్చితమైన కాలపరిమితిని బ్యాంక్ వెల్లడించలేదు. అలాగే, శ్రీరామ్ ఫైనాన్స్ 2 నుంచి 3 సంవత్సరాల కాలానికి 8 శాతం వడ్డీని ఇస్తోంది. మహిళా డిపాజిటర్లకు అదనంగా 0.5 శాతం వడ్డీను కూడా అందిస్తోంది.
* బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీలపై సాధారణంగా 7 నుంచి 8 శాతం వరకు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. అయితే, నిర్దిష్ట కాలపరిమితిని వెల్లడించలేదు. సాధారణంగా ఎన్‌బీఎఫ్‌సీలు 2 నుంచి 3 సంవత్సరాల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీని ఇస్తాయని చెప్పవచ్చు.






