ఆల్ టైం రికార్డుకు బంగారం ధర.. ఇక కొనలేం!

by Yella Dhawani Reddy |

బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.

ఆల్ టైం రికార్డుకు బంగారం ధర.. ఇక కొనలేం!
X

దిశ, వెబ్ డెస్క్: బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. వరుసగా మూడో రోజు భారీగా పెరిగిన పసిడి ధర.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైం రికార్డుకు చేరింది. పెరుగుదల ఇలానే కొనసాగితే రానురాను సామాన్య ప్రజలు బంగారాన్ని కొనే పరిస్తితి కనిపించడం లేదు. గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 70 డాలర్లు పెరిగి రికార్డు స్థాయిలో 2850 డాలర్లకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం(జనవరి 31)న దేశీయ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1200 పెరిగి రూ.77,300గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1310 పెరిగి రూ.84,330గా ఉంది. బడ్జెట్‌ ప్రవేశానికి ముందు బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డుకు చేరుకోవడంతో పసిడి ప్రియులు హడలెత్తిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ స్థాయి ధరలు పెరగడం ఇదే తొలిసారిగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.84,480గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10గ్రాములకు రూ.77,450గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 77,300 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 84,330 వద్ద నిలిచాయి. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరోవైపు బంగారం ధరలు మాదిరిగానే.. వెండి రేటు కూడా పరుగులు పెడుతోంది. వరుసగా రెండో రోజు వెండి ధరలు పెరిగాయి. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 పెరిగి.. రూ.99,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి రూ.1,07,000లకు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు ధరలలో హెచ్చు తగ్గులు ప్రధానంగా దేశంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఇక డాలర్‌తో పోలిస్తే, రూపాయి విలువ క్షీణతను అడ్డుకునేందుకు.. అత్యవసరం కాని ఉత్పత్తులు, లోహాలపై దిగుమతి సుంకాన్ని వచ్చే బడ్జెట్లో పెంచుతారనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో ఉంది. ఈ ప్రభావంతో ధర మరింత పెరుగుతుందనే మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story