- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GST Rate: రేటు కోతలపైనే అందరి దృష్టి
జీఎస్టీ చట్టం సంక్లిష్టమైన కోడ్‌లు, మార్కెట్లో ఉత్పత్తులను విక్రయించే విధానానికి సాంకేతిక వివరణలపై ఆధారపడి ఉంటుందని..

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ వారం చివర్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం జరగనుంది. ప్రజలు జీఎస్టీ రేట్ల సంస్కరణల ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 3–4 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే 56వ సెషన్ కోసం సమావేశమయ్యే జీఎస్టీ కౌన్సిల్ నిల్-రేట్ శ్లాబ్‌ను విస్తరించడం, రేట్లను విలీనం చేయడం, ప్రస్తుతం 18 శాతం పన్ను ఉన్న ఎంపిక చేసిన వస్తువులపై జీఎస్టీని తగ్గించడం గురించి చర్చించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఆమోదం పొందితే, రోజువారీ వినియోగంలోని అనేక ఆహార పదార్థాలు త్వరలో నిల్-రేట్ విభాగంలోకి రావచ్చు.
వర్గీకరణపై ఆందోళనలు
జీఎస్టీ శ్లాబులను తగ్గించడం స్వాగతించే అంశం అయినప్పటికీ, జీఎస్టీ కింద ఉత్పత్తులను ఎలా వర్గీకరిస్తారనే దానిలో సమస్య ఉందని నిపుణులు అంటున్నారు. పన్ను నిపుణులు అమిత్ బైద్ మాట్లాడుతూ.. జీఎస్టీ చట్టం సంక్లిష్టమైన కోడ్‌లు, మార్కెట్లో ఉత్పత్తులను విక్రయించే విధానానికి సాంకేతిక వివరణలపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
ఒకే ఉత్పత్తి, వివిధ పన్నులు
స్పష్టత లేకపోవడం వల్ల ఒకే ఉత్పత్తిపై దాని వివరణను బట్టి వేర్వేరుగా పన్ను విధించే పరిస్థితులకు దారితీస్తుంది. ఉదాహరణకు..
పాప్‌కార్న్‌లో మొక్కజొన్న 5 శాతం పరిధిలో ఉండగా, ప్యాక్ చేసిన సాల్టీ పాప్‌కార్న్ 12 శాతం, కారామెలైజ్డ్ పాప్‌కార్న్ 18 శాతం శ్లాబు కింద ఉంది. అంటే దీనర్థం.. ఒక మొక్కజొన్నలోనే మూడు రకాల పన్నులు. అలాగే, పండ్ల రసాల్లో మామిడి 12 శాతం, సోడా కలిపితే అది 28 శాతం + 12 శాతం సెస్ (మొత్తం 40 శాతాని)కి పెరుగుతుంది. ఒక్క సోడా వల్ల అది విలాస ఉత్పత్తి అవుతుంది. ఐస్ క్రీమ్‌లోనూ రెస్టారెంట్‌లో 5 శాతం, ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి కొంటే 18 శాతం కిందకు వస్తుంది. వాహనాలకు సంబంధించి ఎస్‌యూవీలలో గ్రౌండ్ క్లియరెన్స్ 170ఎంఎం కంటే ఎక్కువ ఉంటే ఒకే మోడల్ కారు 28 శాతం + 22 శాతం సెస్ వర్తిస్తుంది. కేవలం కొన్ని మిల్లీమీటర్లు ప్రజలు కొనే వస్తువుపై పన్నును నిర్ణయిస్తాయి.
చిన్న వ్యాపారాలపై ప్రభావం
ఇటువంటి అస్పష్టమైన వర్గీకరణలు చిన్న వ్యాపారాలపై పెద్ద భారాన్ని సృష్టిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వర్గీకరణల్లో అస్పష్టతలకు ఎస్ఎంఈలు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటాయి. పెద్ద కార్పొరేట్‌ల మాదిరి, వారు అదనపు ఖర్చులను భరించలేరు. వాటిని వినియోగదారులకూ బదిలీ చేయలేరు. దీనివల్ల మార్జిన్ తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో వ్యాపారాలు కొనసాగించడం కష్టమవుతుంది.
ఇన్వర్టెడ్ డ్యూటీ గందరగోళం
ఇదే సమయంలో జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడానికి ముందే సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని పరిశ్రమ వర్గాలతో పాటు రాష్ట్రాలు కూడా కోరుతున్నాయి. ముఖ్యంగా ఇన్వర్టెడ్ డ్యూటీ, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌పై ఆందోళనలు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జీఎస్టీ రేట్ల కోతలతో ఇన్వర్టెడ్ డ్యూటీ నిర్మాణం ఎలా పరిష్కరించబడుతుందో చూడాలని కొందరు వ్యాపారులు అంటున్నారు. అంటే.. పూర్తయిన ఉత్పత్తులపై జీఎస్టీ రేటు 5 శాతానికి తగ్గిస్తే, ఇన్‌పుట్ సేవలపై (లాజిస్టిక్స్, కన్సల్టింగ్ మొదలైనవి) జీఎస్టీ రేటు 18 శాతం ఉంటుంది. దీనివల్ల ఇన్వర్టెడ్ డ్యూటీ పరిధిలోకి వస్తుంది. దీని అర్థం ఇన్‌పుట్ (సేవల)లపై పన్ను తుది ఉత్పత్తి(ఫినిష్‌డ్ ప్రోడక్ట్)పై పన్ను కంటే ఎక్కువగా ఉంటుంది. తుది ఉత్పత్తిపై 5 శాతం పన్ను ఉన్నందున ఇన్‌పుట్ సేవలపై చెల్లించే 18 శాతం జీఎస్టీకి వ్యాపారులు పూర్తి ఇన్‌పుట్ పన్ను క్రెడిట్ (ఐటీసీ)ని క్లెయిమ్ చేయలేరు. ప్రస్తుతానికి 5 శాతం శ్లాబుకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తించదు కాబట్టి. దీనివల్ల తయారీదారులు జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించలేరు.
పరిష్కారమేంటంటే
జీఎస్టీని సరళీకృతం చేయడానికి ఏం చేయవచ్చనే దానిపై, అమిత్ బైద్ స్పందిస్తూ.. దీనికోసం ‘ఒక ఉత్పత్తి, ఒక రేటు’ మేలని చెప్పారు. ఒక వస్తువు బ్రాండింగ్, ప్యాకింగ్ లేదా చిన్న మార్పు ఉన్నప్పటికీ పన్ను తేడా ఉండకూడదని అభిప్రాయపడ్డారు.






