అక్షయ తృతీయ ఎఫెక్ట్.. దేశంలో ఒక్కరోజే ఎన్ని కోట్ల బంగారం విక్రయాలు జరిగాయో తెలుసా?

by Yella Dhawani Reddy |

భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో బంగారానికి (Gold) ప్రత్యేకమైన స్థానం ఉంది.

అక్షయ తృతీయ ఎఫెక్ట్.. దేశంలో ఒక్కరోజే ఎన్ని కోట్ల బంగారం విక్రయాలు జరిగాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో బంగారానికి (Gold) ప్రత్యేకమైన స్థానం ఉంది. పెళ్లిళ్లు, పండుగలు.. ఇంట్లో ఎలాంటి శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. చెప్పాలంటే.. భారతీయులు బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ, ధన త్రయోదశి వంటి పర్వదినాల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తే ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. మరీ బంగారం ధరలు చూస్తేనేమో ఆకాశనంటున్నాయి. సామాన్యుడికి అందనంటూ ఇటీవల ఆల్ టైం రికార్డు (All time record) రూ.లక్ష దాటేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ (Akshya tritiya) సందర్భంగా దేశంలో బంగారం కొనుగోల్లు ఏ విధంగా జరిగాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు ప్రస్తుతం గరిష్ఠ స్థాయిలో ఉన్నందున కొనుగోళ్లపై ప్రభావం పడుతుందని అంతా భావించారు. కానీ, ధరలు అధికంగా ఉన్నప్పటికీ కొనుగోళ్లు ఏ మాత్రం తగ్గలేదు. అక్షయ తృతీయ ఒక్క రోజే దేశంలో 20 టన్నుల బంగారం అమ్మకాలు జరిగాయి. దీని విలువ దాదాపు 18 వేల కోట్లు ఉంటుందని ఆలిండియా జెమ్‌ అండ్‌ జువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (GJC) తెలిపింది. ఇక అక్షయ తృతీయ రోజు దక్షిణాది రాష్ట్రాల్లో కొనుగోళ్లు ఉదయం నుంచే పెరుగగా.. వేసవి కారణంగా ఉత్తరాదిలో మాత్రం సాయంత్రానికి ఊపందుకున్నాయని వెల్లడించింది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఈసారి అనూహ్యంగా మంగళ సూత్రాలు, చైన్లతోపాటు వెండి పాత్రలకు డిమాండ్‌ అధికంగా కన్పించింది. అంతేకాదు, ఈసారి ఎక్కువగా 25–40 ఏళ్ల వయసులోని కస్టమర్లు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే, ఆభరణాల కంటే కడ్డీలు, నాణేలు అధికంగా విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు వెల్లడించారు. అలాగే పాత బంగారు నగలు ఇచ్చి కొత్తవి కొనుగోలు చేయటం ద్వారా 50 శాతం సేల్స్‌ జరిగాయన్నారు.

ఇక వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక ప్రకారం.. ఈసారి బంగారంపై పెట్టుబడులు 7 శాతం పెరిగి 46.7 టన్నులకు చేరాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో 43.6 టన్నులుగా ఉన్నాయి. స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు గురవడంతో మదుపరులు పుత్తడి వైపునకు తమ పెట్టుబడులను మళ్లించారు. అయితే, ఎక్కువగా ప్రజలు గోల్డ్ ETFలపై వైపు మొగ్గుచూపటంతో అక్షయ తృతీయ రోజు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. మరోవైపు ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో దేశీయంగా బంగారానికి గిరాకీ 15 శాతం మేర పడిపోయి 118.1 టన్నులకు తగ్గినట్లు ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది. కానీ, అధిక ధరలతో విలువ మాత్రం 22 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది.

గోల్డ్ ETF అంటే ఏంటి?

గోల్డ్ ETF అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (Gold Exchange Traded Fund). ఇది ఒక రకం మ్యూచువల్ ఫండ్, కానీ స్టాక్ మార్కెట్‌లో ట్రేడయ్యే రీతిలో పనిచేస్తుంది. గోల్డ్ ETFలో పెట్టుబడి పెడితే.. షేర్ల లాగా స్టాక్ ఎక్స్చేంజ్ (NSE/BSE)లో కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనడం కంటే నాణ్యత, భద్రత, నిల్వ సమస్యలు ఉండవు. డెమాట్ అకౌంట్ ఉంటే చాలు. బంగారాన్ని డైరెక్ట్‌గా కొనకుండా, డిజిటల్ పద్ధతిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గోల్డ్ ETF మంచి ఎంపిక.

Next Story