Airtel: సైబర్ మోసాలపై పోరాటానికి ఎయిర్‌టెల్ చొరవ

by S Gopi |

మోసాలను, సంబంధిత ముప్పును సమిష్టిగా పరిష్కరించుకోవాలని ఇతర టెలికాం కంపెనీలను ఎయిర్‌టెల్ కోరింది.

Airtel: సైబర్ మోసాలపై పోరాటానికి ఎయిర్‌టెల్ చొరవ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో పెరుగుతున్న టెలికాం మోసాలు, స్కామ్‌లను అరికట్టేందుకు పరిశ్రమ మొత్తాన్ని ఏకం చేసే దిశగా భారతీ ఎయిర్‌టెల్ చొరవ తీసుకుంది. ఈ సమస్యలపై పోరాడేందుకు ఉమ్మడిగా చర్యలు తీసుకునేందుకు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలను సంప్రదించినట్టు ఎయిర్‌టెల్ ప్రభుత్వంతో పాటు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు సమాచారం అందించింది. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని మోసాలను, సంబంధిత ముప్పును సమిష్టిగా పరిష్కరించుకోవాలని ఇతర టెలికాం కంపెనీలను ఎయిర్‌టెల్ కోరింది. ఈ సందర్భంగా దేశంలో 2024 ఏడాది తొమ్మిది నెలల కాలంలో మొత్తం 17 లక్షలకు పైగా సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. దీనివల్ల రూ. 11,000 కోట్లకు పైగా ఆర్థిక నష్టం జరిగిందని కంపెనీలకు రాసిన లేఖలో పేర్కొంది. సైబర్ మోసగాళ్లు ఫిషింగ్ లింక్‌లు, నకిలీ లోన్ ఆఫర్లు, మోసపూరిత పేమెంట్ పేజీలు వంటి కొత్త రకం మోసాలను అనుసరిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో డిజిటల్ మోసాలు, ఐడెంటిటీ చోరీ ఘటనలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎయిర్‌టెల్ తెలిపింది. ఇప్పటికే తాము డిజిటల్ స్పామ్, స్కామ్‌లపై పోరాటాన్ని ముమ్మరం చేశాం. గత కొన్ని వారాలుగా వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఓటీటీ యాప్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో మోసపూరిత సైట్‌లను బ్లాక్ చేసే విధానాన్ని ప్రారంభించామని ఎయిర్‌టెల్ కంపెనీలకు రాసిన లేఖలో పేర్కొంది.

Next Story