- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Domestic Airlines: జెట్ ఫ్యూయెల్ ధరల పెంపును వాయిదా వేయండి
ఈ అంశంపై ఆయిల్ రిఫైనరీలు, విమానయాన సంస్థలు, కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ మధ్య చర్చలు జరుగుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత విమానయాన రంగంపై తీవ్రంగా ఉంది. పెరుగుతున్న ఇంధన భారంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలను ప్రస్తుతానికి పెంచవద్దని ప్రభుత్వ రంగ చమురు సంస్థలను కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ప్రతిపాదనలు పంపాయి. ఈ అంశంపై ఆయిల్ రిఫైనరీలు, విమానయాన సంస్థలు, కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ మధ్య చర్చలు జరుగుతున్నాయి. జూన్ 1లోపు దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దేశంలో ఏటీఎఫ్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా సమీక్షిస్తాయి. అయితే ఇటీవల ఇరాన్ సంఘర్షణ కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరగడంతో, ప్రభుత్వం ఏప్రిల్‌లో జెట్ ఇంధన ధరల పెంపును 25 శాతానికి పరిమితం చేసింది. మేలో ధరలను స్థిరంగా ఉంచాలని కూడా సూచించింది. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు దేశీయ విమానాలకు ఏటీఎఫ్‌ను కిలోలీటరుకు సుమారు రూ. 1.05 లక్షలకు విక్రయిస్తున్నప్పటికీ, ఒక్కో కిలోలీటరుపై సుమారు రూ. 92,000 నష్టాన్ని భరిస్తున్నట్లు సమాచారం. జూన్‌లో ధరలను మళ్లీ 25 శాతం పెంచాలనే అంశాన్ని రిఫైనరీలు పరిశీలిస్తున్నాయి.
ఇంధన వ్యయం భారత విమానయాన సంస్థల మొత్తం ఖర్చులో దాదాపు 40 శాతం వాటా కలిగి ఉంది. అదే సమయంలో రూపాయి బలహీనపడటంతో విమానాల లీజులు, విదేశీ ఎయిర్‌పోర్ట్ ఛార్జీలు వంటి డాలర్ చెల్లింపులు మరింత భారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో టికెట్ ధరలు పెంచాల్సి రావడంతో ప్రయాణికుల డిమాండ్ కూడా తగ్గుతోంది. కొన్ని ఎయిర్‌లైన్స్ ఇప్పటికే తమ షెడ్యూళ్లను తగ్గించగా, మరికొన్ని సంస్థలు పన్ను రాయితీలు, చెల్లింపుల వాయిదాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే కొన్ని రూట్లలో విమాన సర్వీసులు నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.






